Telangana Government (4)
Telangana Government Increased Security : దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులకు భద్రత పెంచింది. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఉన్న 2+2 భద్రతను 4+4గా పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఇంటెలిజెంట్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తలున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు తక్షణమే భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించింది.
మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులకు భద్రత పెంపుపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా భద్రత పెంచాలని కోరారు. తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
pickpocketing : చంద్రబాబు ర్యాలీలో జేబు దొంగ హల్ చల్.. పలువురి ఫోన్స్, డబ్బులు కొట్టేసిన కేటుగాడు
కాగా, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. గటని రాజు అనే వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రభాకర్ రెడ్డిపై రాజు కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.
ప్రభాకర్ రెడ్డిని సూరంపల్లి నుంచి గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆస్పత్రి నుంచి వెంటనే హైదరాబాద్ కు తరలించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజును బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.