Telangana Govt: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణను సీబీఐకు అప్పగిస్తూ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని.. ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. జస్టిస్ సీపీ ఘోష్ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని, అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు తెలంగాణ సర్కార్ రాసిన లేఖలో కోరింది.
సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో.. గత ప్రభుత్వం 2022లో జీవో నెంబర్ 51 ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీని నిషేధించిన విషయం తెలిసిందే. 2022 జీవోను సడలిస్తూ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 104ను విడుదల చేసింది. ఎన్టీఎస్ఏ రిపోర్టు ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కేంద్రాన్ని కోరింది.