వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం జీవో జారీ, మార్గదర్శకాలు ఇవే

ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు.

Rs 500 Gas Cylinder Scheme

Rs 500 Gas Cylinder Scheme : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే 500లకే గ్యాస్ సిలిండర్ అందజేసే పథకానికి సంబంధించి జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఇక గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి కూడా మరికాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు ప్రమాణాలను (మార్గదర్శకాలు) ప్రభుత్వం ప్రకటించింది.

1. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి.
2. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి.
3. ప్రజాపాలన దరఖాస్తుదారు పేరటి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి.

ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు. సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారుల ఖాతాలో వేయనున్నాయి. మహాలక్ష్మి పథకానికి ఇప్పటివరకు సుమారు 39లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. దారిద్ర రేఖకు దిగువున ఉండి, ఆహార భద్రత కార్డులో పేర్లు నమోదై వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది.

రాష్ట్రంలో 90లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. వాటిని కలిగున్న వారిలో వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు 64లక్షల మంది. ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, ఆధార్ సంఖ్య, ఆహార భద్రత కార్డు నెంబర్.. అన్నీ పక్కాగా ఉన్న దాదాపు 39లక్షల మందిని లబ్దిదారులుగా ఎంపిక చేశారు. ఉజ్వల్ పథకంలో లబ్దిదారులుగా ఉన్న వారికి కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఉజ్వల లబ్దిదారులకు 340రూపాయల చొప్పున కేంద్రం నుంచి సబ్సిడీ వస్తోంది. వారు రూ.615కు చెల్లించి సిలిండర్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి మరో 115 రూపాయల సబ్సిడీ ఇచ్చి రూ.500కే సిలిండర్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.

గృహజ్యోతి స్కీమ్ కి సంబంధించి లబ్దిదారులు మార్చిలో జీరో బిల్లును అందుకుంటారు. తొలుత ఈ పథకం అమలు కోసం కర్నాటక తరహాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని భావించినా.. తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. ఫిబ్రవరి నెలలో 200 యూనిట్ల లోపు వినియోగించి తెల్లరేషన్ కార్డు ఉండి ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో జీరో బిల్లు జారీ చేయనున్నారు. ఇంటి యజమానులతో పాటు అద్దెకు ఉన్న వారికి కూడా ఈ స్కీమ్ అమలు కానుంది.

Also Read : కాంగ్రెస్‌కు ఓటువేసి మోసపోయామని వాపోతున్నారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

అద్దెదారులు ఇంటిని ఖాళీ చేయగానే సంబంధిత సెక్షన్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయంలో తెల్లరేషన్ కార్డుతో పాటు కొత్తగా ఏ ఇంట్లో అద్దెకు దిగారో ఆ ఇంటి కరెంట్ కనెక్షన్ వివరాలు అందించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ను నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఎప్పుడో జారీ చేసిన తెల్లరేషన్ కార్డు ఉండటంతో కొత్తగా తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కార్డులు అందుకునే వారు తమ ఇంటి కనెక్షన్ నెంబర్, తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును జత చేస్తే ఆయా పథకాలు పొందొచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు