Indira Dairy Programme
Indira Dairy Programme : తెలంగాణలోని రేవంత్ సర్కార్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడంతోపాటు.. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డెయిరీ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండేసి పాడి గేదెలు లేదా ఆవులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఇందిరా డెయిరీ ప్రాజెక్టుపై దృష్టిసారించింది.
ఇందిర డెయిరీ ప్రాజెక్టు కింది ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలికి రూ.2లక్షల యూనిట్ ధరతో రెండు పాడి గేదెలు లేదా అవులను అందజేస్తారు. ఇందులో ప్రభుత్వం 70శాతం సబ్సిడీ ఇస్తుంది.. బ్యాంకుల ద్వారా30శాతం రుణాలు ఇస్తారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
ఇందిరా డెయిరీ ప్రాజెక్టును ప్రభుత్వం మధిర నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 781.82 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే రూ. 286 కోట్లను విడుదల చేసిన సర్కార్.. తాజాగా.. రూ.124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు లభించాయి.