Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ భూముల యాజమానులకు భారీ ఊరట.. 45రోజుల్లో పరిష్కారంకు చర్యలు
Telangana Govt : తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
- Harish Thanniru
- Published on- August 13, 2026 / 02:12 PM IST
Telangana Govt 22A Lands
Telangana Govt : తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేసిన తరువాత.. అర్హత ఉన్న వాటిని జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. బీసీ మహిళలకు భారీ శుభవార్త.. 100 శాతం ఉచితంగా..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 లక్షల ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 66 లక్షల ఎకరాలు అటవీ భూములు, 24 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములతోపాటు దేవాదాయ తదితర కేటగిరీల భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. కొన్ని ప్రైవేటు భూములు కూడా 22ఏ జాబితాలోకి వెళ్లడంతో వాటి యజమానులు ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే రికార్డుల్లో జరిగిన పొరపాట్లు, గతంలో చేపట్టిన సర్వేల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇలా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది.
22ఏ జాబితాలో భూములు ఉండటంతో వాటిని విక్రయించలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక కొందరు భూ యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకు రుణాలు పొందడంలోనూ వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో.. ప్రత్యేకంగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో 22ఏ భూములపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి అర్హులైన భూ యజమానులకు ఊరట కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
