Local body elections
Telangana Govt : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పలువురు మంత్రులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నిర్వహణ, తదితర విషయాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ఎన్నికల నిర్వహణ విషయంపై తుది నిర్ణయాన్ని రేవంత్ రెడ్డికే వదిలేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గ్రామ పంచాయతీలకు దాదాపు 20 నెలలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు దాదాపు 14 నెలల కిందట కాల పరిమితి ముగిసింది. ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని భావించి.. ప్రభుత్వం ఇంతకాలం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్‌కు పంపగా.. దానిని ఆయన రాష్ట్రపతి అనుమతి కోసం పంపించారు. ప్రస్తుతం ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇటీవల హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు ప్రకారం.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. హైకోర్టు తీర్పు ప్రకారం.. ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మెజార్టీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఈనెలాఖరు నాటికి స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేని పక్షంలో మరింత గడువు కావాలని హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్ కు పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు. గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా స్పందన లేదు. బిల్లుల ఆమోదానికి బీజేపీ రాజకీయ కారణాలతో సహకరించదని, ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే పార్టీపరంగా బీసీలకు 42శాతం టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చించినట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై చర్చించిన తరువాత.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ఆ వెంటనే వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈనెల 25వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.