Pension Hike: తెలంగాణలో పింఛన్ల పెంపు త్వరలోనే అమలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఫించన్ల పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే. వృద్ధాప్య పింఛన్లతో పాటు వితంతు, ఇతర సామాజిక భద్రత పింఛన్లను పెంచాల్సి ఉంది. వీటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే పింఛన్ల పెంచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. మరో 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?
పింఛన్లు పెంచితే తెలంగాణ ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో పింఛన్లకు సర్కారు రూ.11,635 కోట్ల వరకు కేటాయింపులు చేసింది.
పింఛన్లు పెంచితే ఈ కేటాయింపులు రూ.22 వేల కోట్ల వరకు చేయాల్సి ఉంటుంది. దీంతో బడ్జెట్‌లో సర్దుబాటులపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. నిధుల సమీకరణకు ఉన్న మార్గాల వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు. మరోవైపు, ఇటీవల చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అందాయి. దీంతో కొత్తగా పింఛన్‌కు అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు పెరగడం, వైద్య ఖర్చుల దృష్ట్యా పింఛను పెంచాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్‌ను పకడ్బందీగా అమలు చేస్తే బోగస్ పింఛన్లకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.