Telangana Govt
Telangana Govt : భూ సమస్యలతో సతమతం అవుతున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు భూమి రికార్డుల్లో ఉన్న అస్తవ్యస్తతను సరిదిద్ది.. అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూముల జాబితాను అధికారులు రూపొందించారు. రాష్ట్రంలో మొత్తం భూమి విస్తీర్ణం 2.50 కోట్లు ఎకరాలకుపైగా ఉండగా.. ఇందులో 1.53 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి మాత్రమే చట్టబద్దమైన లావాదేవీలకు వీలు కల్పించే పట్టా పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. మిగతా కోటి ఎకరాలకుపైగా భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చుతూ అధికారులు జాబితాను సిద్ధం చేశారు.
ఈ మొత్తం భూమికి సంబంధించి లావాదేవీల నిలిపివేత నిమిత్తం త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి భూ భారతి పోర్టల్లోకి లాక్ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ చర్య ద్వారా రాష్ట్రంలో భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది.
Also Read: తెలంగాణలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు..! రేవంత్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారు?
నిషేధిత జాబితాలో అసైన్డ్ ల్యాండ్స్, అటవీ భూములు, నీటిపారుదల ప్రాజెక్టుల భూములు, రోడ్లు, ఇంటి స్థలాల రూపంలో ఉన్న భూమి ఇలా దాదాపు 77లక్షల ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం అధికారులు అంచనా వేశారు. మరోవైపు.. పట్టా పాస్‌బుక్ జారీ చేయని వ్యవసాయ భూములు 18లక్షల ఎకరాలకుపైగా.. పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయని కేటగిరీ కింద 11 లక్షలకుపైగా ఖాతాలు ఉన్నాయి. భూ భారతిలో లావాదేవీలకు పాస్ బుక్ తప్పనిసరి కాబట్టి ఈ భూములు కూడా తాత్కాలికంగా నిషేధిత జాబితాలోనే కొనసాగుతాయి.
అంతేకాదు.. వ్యవసాయేతర అవసరాల కోసం కన్వర్ట్ చేసుకున్న సుమారు మూడు లక్షల ఎకరాల విస్తీర్ణం కూడా ఈ జాబితాలోకి చేరుతుంది. వీటితోపాటు వివాదాస్పదంగా ఉన్న ప్రైవేట్ పట్టా భూములు కూడా ఈ జాబితాలో చేరనున్నాయి.
నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. ఈ భూములు పై ఎలాంటి లావాదేవీలు చేయాలన్నా లేదా ఒకరి నుంచి మరొకరికి బదలాయింపు చేయాలన్నా కచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే. ఈ జాబితాను లాక్ చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ముఖ్యంగా అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టడం సులభతరం అవుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.
నిషేధిత భూముల జాబితా ఇలా చూసుకోవచ్చు..
ఎవరివైనా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయో లేవో తెలుసుకోవాలంటే భూభారతి పోర్టల్లోకి వెళ్లి చూసుకోవచ్చు. భూభారతి పోర్టల్ ఓపెన్ కాగానే.. జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం నమోదు తరువాత కాప్చా ఎంటర్ చేస్తే నిషేధిత భూముల జాబితా వచ్చేస్తుంది. సర్వే నెంబర్, ఖాతా నెంబర్, యాజమాని పేరు, భూమి రకం తదితర వివరాలు వస్తాయి.