Telangana Governor Jishnu Dev Varma
Governor Jishnu Dev Varma: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో గణనీయమైన విజయాలను సాధించి.. ప్రజల విశ్వాసాన్ని, ప్రశంసలను సంపాదించిందని తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ శర్మ అన్నారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొని మాట్లాడారు. “77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-I, II, III, IV నియామకాలను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.
ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తదితర సంస్థల ద్వారా 62,749 మంది యువతకు ఉద్యోగాలు కల్పించింది. మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూల సూత్రాలతో దేశం నడుస్తోంది. ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ అనే దార్శనిక పత్రాన్ని తెలంగాణ సర్కారు ఆవిష్కరించింది. దీని ద్వారా ప్రభుత్వం సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది.
Also Read: అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తావన
‘వికసిత్ భారత్’ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
గత డిసెంబరులో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ ప్రతినిధుల మధ్య ప్రభుత్వం ఈ దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది. క్యూర్, ప్యూర్, రేర్ (CURE, PURE, RARE)తో తెలంగాణలో సమగ్ర అభివృద్ధికి కృషిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటూ, జిల్లా కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాం” అని అన్నారు.
రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు శాశ్వత మౌలిక వసతుల కోసం రూ.251 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసి, అభివృద్ధి చేస్తోందని గవర్నర్ తెలిపారు. “రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తోంది. రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేయడం ద్వారా రూ.20,617 కోట్ల వ్యయంతో సుమారు 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి అందించే సాయాన్ని కొనసాగిస్తోంది ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 14.24 లక్షల మంది రైతుల నుంచి సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు రూ.17,079.50 కోట్ల చెల్లింపులు జరిగాయి. అదనంగా రూ.1,453 కోట్లను బోనస్ సబ్సిడీగా పంపిణీ చేశారు.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కోసం రూ.2,700 కోట్ల వ్యయంతో 27 ఎకరాల్లో ప్రభుత్వం అత్యాధునిక కొత్త ఆసుపత్రిని నిర్మిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో రూ.16,521 కోట్లు ఖర్చు చేసింది. ఉచితంగా సన్నబియ్యాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రూ.1.03 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా 3.34 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది.
ప్రతి నెల 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ అవుతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. హెచ్‌ఐఎల్‌టీ విధానంతో కాలుష్య పరిశ్రమలను నగరం బయటకు తరలించే ప్రక్రియను చేపట్టాం.
ముచ్చర్ల, కందుకూరు ప్రాంతాల్లో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోంది. ఇది నెట్-జీరో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. మూసీ నది పునరుజ్జీవనానికి 55 కి.మీ. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాం. చెరువుల ఆక్రమణల నివారణకు హైడ్రాను తీసుకువచ్చారు. అంబర్‌పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించాం.
హ్యామ్ మోడల్‌లో 12,000 కి.మీ రహదారుల అభివృద్ధికి రూ.11,399 కోట్లను మంజూరు చేశారయ్యాయి. గ్రామీణ రహదారులకు ప్రభుత్వం రూ.16,007 కోట్లను ప్రతిపాదనలు చేసింది” అని అన్నారు.