Indiramma Indlu: హైదరాబాద్‌సహా ఆ జిల్లాల్లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త..

గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.

Indiramma Indlu

Indiramma Indlu: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం అమల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన కార్యాచరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టిసారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న చోటే జీ ప్లస్ 3 విధానంలో ఇళ్లను నిర్మించి ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రైవేట్ వ్యక్తులకు చెంది.. పేదల ఆధీనంలో ఉన్న స్థలాలు, కబ్జాకు గురైన భూములను కూడా గుర్తించాలన్నారు. అందుకు సంబంధించిన నివేదికలను సాధ్యమైనంత త్వరగా అందించాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రతి జిల్లా కలెక్టర్‌ ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు.

హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని మురికివాడల్లో సర్వే నిర్వహించి 25,501 మంది పేదలు కచ్చా ఇళ్లలో ఉంటున్నట్లు గుర్తించడం జరిగిందని,  అయితే, వాటిల్లో ఎన్ని మురికివాడల్లో ఎంత భూమి అందుబాటులో ఉంది..? జీ ప్లస్ 3 విధానంలో ఎన్ని ఇళ్లను నిర్మించొచ్చు.. అనే అంశాలపై ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు.