Telangana Rains
Telangana Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు (Telangana Rains) దంచికొడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో 12గంటల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే, మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Cm Revanth Aerial Survery: జల విలయం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..
తెలంగాణలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
కుంభవృష్టి కారణంగా పలు ప్రాజెక్టులకు వరద ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి బేసిన్ లో పోచారం ప్రాజెక్టుకు గురువారం రాత్రి నాటికి 60వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిజాం సాగర్ కు 1.80లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 2.20 లక్షలు దిగువకు వదులుతున్నారు.
ఎస్ఆర్ఎస్పీకి 1.75లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 2.83లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఎల్లంపల్లికి 7.30లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 8.07లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ మానేరుకు 77వేల క్యూసెక్కులు, మధ్య మానేరుకు 75వేల క్యూసెక్కులు వస్తుండగా.. అంతేమొత్తం వదులుతున్నారు. మేడిగడ్డకు 4.51లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. అంతేమొత్తం దిగువకు వదులుతున్నారు.