Bandla Ganesh : బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్.. డీఆర్‌టీ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు
Bandla Ganesh : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు అనుకూలంగా ఉన్న డీఆర్‌టీ తీర్పును హైకోర్టు కొట్టివేసింది.
- Harish Thanniru
- Updated on- July 4, 2026 / 08:48 AM IST
Telangana high court key verdict on bandla ganesh property auction
- బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
- డీఆర్‌టీ ఉత్తర్వులను రద్దు చేసిన కోర్టు
- గణేశ్ కుటుంబ ఆస్తి వేలం సబబేనని వెల్లడి
Bandla Ganesh : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు అనుకూలంగా ఉన్న డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) తీర్పును హైకోర్టు కొట్టివేసింది. రుణ వసూళ్లలో భాగంగా బండ్ల గణేశ్, ఆయన కుటుంబానికి చెందిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం ద్వారా చేసిన విక్రయాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పును వెలువరించింది.
బండ్ల గణేశ్, ఆయన తండ్రి, సోదరుడు తదితరులకు చెందిన ఆస్తి వేలాన్ని డీఆర్‌టీ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. డీఆర్‌టీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంకు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ ప్రవీణ్ కుమార్‌ల ధర్మాసనం విచారించింది. బ్యాంకు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఎస్. ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణాల వసూళ్లలో భాగంగా హామీదారులైన బండ్ల గణేశ్ కుటుంబానికి చెందిన ఆస్తిని సర్ఫేసీ చట్టం కింద 2019లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం 2022లో నిర్వహించిన వేలంలో రూ.8.51కోట్లకు ఆస్తి విక్రయించడం జరిగిందని తెలిపారు.
సదరు వేలం చెల్లదంటూ బండ్ల గణేశ్ డీఆర్‌టీని ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో డీఆర్‌టీ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ యూనియన్ బ్యాంకు, కొనుగోలుదారులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. యూనియన్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ బండ్ల గణేశ్‌కు అనుకూలంగా ఉన్న డీఆర్‌టీ తీర్పును కొట్టేసింది.
