Telangana Politics : బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుకు రంగం సిద్ధం..! న్యాయనిపుణులతో సీఎం రేవంత్, భట్టి భేటీ
Telangana Politics : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వ రద్దుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Telangana Politics
Telangana Politics : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. స్పీకర్ కంటతడిసైతం పెట్టుకున్నారు. దీంతో గడ్డం ప్రసాద్ కుమార్‌ను కులం పేరుతోపాటు, అసభ్య పదజాలంతో దూషించారని స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వారిని అరెస్టు చేసి, విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లకు తరలించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు, నవీన్ రెడ్డిల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇప్పటికే తాతా మధు వ్యాఖ్యలపై శాసనసభ తీర్మానం చేసి మండలికి పంపుతామని స్పీకర్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. స్పీకర్ పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది. తాతా మధుతోపాటు నవీన్ కుమార్ రెడ్డిపై చర్యలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క న్యాయనిపుణులతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మీద చర్యలపై సీఎం రేవంత్ న్యాయసలహా కోరినట్లు తెలిసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి మండలికి పంపి తాతా మధు, నవీన్ రెడ్డి సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరామర్శించారు. అనంతరం తాజా పరిణామాలపై స్పీకర్‌తో చర్చించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వ్యవహరించారని అన్నారు. స్పీకర్ కంటతడి పెట్టుకున్న దృశ్యాలు చూసి సీఎం రేవంత్ ఆవేదన చెందారని భట్టి తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
