AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్న్యూస్
AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక భారం తగ్గించేలా పలు రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీపై అందించేందుకు సిద్ధమవుతోంది.
AP Government
AP Government : ఏపీలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలపై భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రజలకు సబ్సిడీపై సరుకులు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉల్లిపాయల్ని కేజీ రూ. 35కే రైతు బజార్ల ద్వారా అందిస్తోన్న ప్రభుత్వం.. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, పంచదార, గోదుమపిండిని రాయితీ ధరకు సరఫరా చేసేందుకు నిర్ణయించింది.
Also Read : AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు కూటమి సర్కార్..!
నిత్యావసరాల వస్తువులు సబ్సిడీపై అందించే విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. విజయవాడలోని రైతు బజార్లో కేజీ ఉల్లిపాయలు రూ.35కు విక్రయించే కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమపిండిని రాయితీ ధరకు సరఫరా చేస్తామన్నారు. కేంద్రం ఏపీకి 1.20 లక్షల టన్నుల కందిపప్పు, 86,400 కిలో లీటర్ల పామాయిల్ సబ్సిడీ ధరలకు అందించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ సరుకులను రేషన్ షాపుల ద్వారా అర్హులైన కుటుంబాలకు అందించనున్నట్లు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. రేషన్ షాపులను భవిష్యత్తులో ‘మీ మార్ట్స్’గా అభివృద్ధి చేసి, సుమారు 64రకాల నిత్యావసర సరుకులను అందుబాటు ధరలకు అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభమైనట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగాయి. కిలో ఉల్లి రూ. 60 నుంచి రూ.70వరకు పలుకుతోంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఉల్లిపాయలను రాయితీపై అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35కే అందిస్తోంది.
ప్రతి కుటుంబానికి నెలకు రెండు కిలోల చొప్పున సబ్సిడీ ఉల్లిని ప్రభుత్వం అందిస్తుంది. ఇందుకోసం ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 130 రైతుబజార్లలో ఈ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇదేక్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేలా సబ్సిడీపై కందిపప్పు, పామాయిల్, చెక్కర, గోధుమ పిండిలను కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
