Telangana Rain Alert : తెలంగాణకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు
Telangana Rain Alert : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Rain Alert
- తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్
- నేడు, రేపు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rain Alert : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతం, ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని, ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో సాధారణం కన్నా ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఈనెల రెండో వారంలో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని, చెట్లు కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
