Telangana High Court
TS High Court On Singareni Elections 2023: సింగరేణి ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28న సింగరేణి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేసింది. తిరిగి డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా నవంబర్ 30వ తేదీలోపు కార్మికశాఖకు తుది ఎన్నికల జాబితా సమర్పించాలని సింగరేణికి స్పష్టం చేసింది. అలాగే సింగరేణి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలకు సహకరిస్తామని రేపటిలోగా హామీ పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also : తండ్రి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్న కొడుకు.. ముషిరాబాద్ అసెంబ్లీ బరిలో అంజన్న!
గత కొద్దికాలంగా హైకోర్టులో సింగరేణి ఎన్నికల వివాదం జరుగుతుంది. అయితే, ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సుమఖంగా లేవు. దీంతో సింగరేణి యాజమాన్యం ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తీర్పునిచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది.
Read Also : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్
అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. సింగరేణి యాజమాన్యం అప్పీల్ పై బుధవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ధర్మాసనం సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ఈనెల 28న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత.. అంటే డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సింగరేణి యాజమాన్యంను ఆదేశించింది.