తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. ఆయనతోపాటు తన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం (జులై 3, 2020) డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం మంత్రి మహమూద్ అలీకి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.
కరోనాతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే స్వల్ప అస్వస్థతతో ఉండటంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా మహమూద్ అలీని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోలుకొని ఇంటికి వెళ్లారు. కరోనా బారిన పడిన ఆయన కుటుంబ సభ్యులు కూడా కోలుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.
అందరి ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తాము త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయన సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీత అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.
ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని..చికిత్స కొనసాగుతుందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో కరోనా నుంచి కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆమె తెలిపారు.