తప్పలేదు భారీ మూల్యం: చెట్టే కదాని నరికాడు..రూ.50వేలు ఫైన్ కట్టాడు

Telangana huge fine tree cutter peddapalli : ‘మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా’నంటూ ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వీరశంకర్ రెడ్డికి ఇచ్చి థమ్కీని మరచిపోలేం. అటువంటిదో ఓ వ్యక్తి చెట్టే కదాని నరికేశాడు.తరువాత భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. దాదాపు రూ.50వేలు జరిమానా కట్టాడు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగింది.

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలోని సంతోష్‌నగర్‌లో పిడుగు సతీశ్‌ అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం తన ఇంటి ముందున్న చెట్టును నరికేశాడు. అలా నరికిన ఆ చెట్టు కొమ్మలు తెగి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. దీంతో షార్ట్‌సర్క్యూట్‌ అయి నగరపాలక సంస్థకు చెందిన 25 వీధిదీపాలు కాలిపోయాయి. దీంతో మున్సిపల్‌ అధికారులు మండిపడ్డారు. పర్మిషన్ లేకుండా చెట్టుని కొట్టటమే కాకుండా భారీ నష్టం జరిగేలా చేశావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మున్సిపల్ చట్టం–2019 ప్రకారం రూ.49,500 జరిమానా చెల్లించాలని కమిషనర్‌ పి.ఉదయ్‌కుమార్‌ మంగళవారం (జనవరి 19) సతీశ్‌కు నోటీసు జారీ చేశారు.

దీంతో ఏమీ చేయలేని సతీశ్ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. మరోసారి ఇలా చేయనని అధికారులకు మాట ఇచ్చాడు. అదన్నమాట చెట్టే కదనా నరికేసినదానికి మూల్యం..

కాగా..పచ్చదనం పెంపొందించటం కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. పచ్చదనం పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం విస్తృతంగా చేపడుతూనే ఉన్న చెట్లను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ చెట్టు తొలగించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు.