Minister Sridhar Babu: ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు "ఇంటింటికి ఇంటర్నెట్" కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)స్పష్టం చేశారు.

Telangana mandates t fiber internet connectivity for all government offices Minister Sridhar babu

  • ప్రభుత్వ ఆఫీసుల్లో టీ-ఫైబర్ సేవలు
  • ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులు బంద్
  • ఇంటింటికీ వేగవంతంగా ఇంటర్నెట్ సేవలు

Minister Sridhar Babu: తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత విస్తరించడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సచివాలయంలో టీ-ఫైబర్ (T-Fiber) పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్ని వేగవంతం చేయడంలో టీ-ఫైబర్ పాత్ర అత్యంత కీలకమని, అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే నెట్‌వర్క్ పరిధిలోకి రావడం వల్ల పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

No Insurance No Fuel: ఇక ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్.. కేంద్రానికి సంచలన ఆదేశాలు.. వాహనదారులకు సుప్రీం కోర్టు షాక్

ప్రైవేట్ ఇంటర్నెట్‌కు స్వస్తి – టీ-స్వాన్ బదిలీ వేగవంతం:

ప్రభుత్వ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ శాఖలు ఉపయోగిస్తున్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రతీ ప్రభుత్వ ఆఫీసుకు కనెక్టివిటీ కల్పించడం ద్వారా డిజిటల్ పాలనను ఒకే వేదికపైకి తీసుకురావచ్చని వివరించారు.

ఇక ఇంటింటికీ ఇంటర్నెట్:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు ప్రారంభ దశ నుంచే పూర్తి స్థాయి టీ-ఫైబర్ సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు “ఇంటింటికి ఇంటర్నెట్” కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.