Meeseva Charges : సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన మీసేవ ఛార్జీలు.. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ కి ఎంత ఇవ్వాలి.. లిస్ట్ ఇదే..
Meeseva Charges : ప్రజలకు భారీ షాక్.. మీసేవ కేంద్రాల్లో సర్వీసు ఛార్జీలు భారీగా పెరిగాయి.
- Dharani Pilli
- Published On : April 2, 2026 / 07:27 AM IST
telangana meeseva usage charges increased by 50 percent
Meeseva Charges : తెలంగాణ ప్రజలకు కీలక అలర్ట్.. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవల ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి ఏకంగా 50 శాతం పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. తాజా నిర్ణయంతో.. కేటగిరీ-ఏలో సర్వీసు ఛార్జీలు రూ.35 నుంచి రూ.62కి పెరిగాయి. అలానే కేటగిరీ-బీలో సర్వీసు ఛార్జీలు రూ.45 నుంచి ఒకేసారి రూ.80కి పెరిగాయి.
వాస్తవానికి ప్రభుత్వం మీసేవలో అందించే సేవల మీద 50 శాతం ఛార్జీలను పెంచినప్పటికీ.. అదనంగా 18 శాతం జీఎస్టీ అమలుతో.. ఈ పెంపు కాస్త 77-78 శాతం వరకు పెరుగుతోంది. దీంతో ఇకపై మీసేవ కేంద్రాల్లో కులం, ఆదాయం, ఇతర సేవల కోసం అప్లై చేసే ప్రజలు, విద్యార్థులపై భారీ మొత్తంలో ఆర్థిక భారం పడనుంది. అయితే తాజా నిర్ణయంతో మీసేవ నిర్వాహకులకు సుమారు 15 ఏళ్ల తర్వాత కమీషన్ భారీగా పెరగనుంది.
సేవలకు దరఖాస్తు చేయడమే కాక.. అదనంగా 4 కన్నా ఎక్కువ పత్రాలు ప్రింట్ తీయాలన్నా.. స్కాన్ చేసుకోవాలన్నా.. గతంలో పేజీకి రూ.2 చెల్లించేవారు. ఇకపై ఇది రూ.2.5కి పెరిగింది. అంటే ఇప్పుడు ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటే.. గతంలో అయితే రూ.45 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు పెంచిన 50 శాతం ఛార్జీతో కలిపి రూ.67.5తో పాటు అదనంగా జీఎస్టీ 18 శాతం కలిపి రూ.79.65 (రౌండ్ ఫిగర్ రూ.80) చెల్లించాలి. అంటే ఒక్కో పత్రం కోసం దరఖాస్తు ఫీజు భారం రూ.35గా ఉంది.
గతంలో విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అప్లై చేసే సమయంలో విద్యార్థి ఆధార్ ధ్రువీకరణకు రూ.20 వసూలు చేసేవారు. ఇకపై ఆ మొత్తాన్ని రూ.35కి పెంచింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల కన్నా ఎక్కువ వసూలు చేస్తే 1100 లేదా 18004251110 నంబర్లలో లేదా meesevasupport@telangana.gov.in చిరునామాకు ఈ-మెయిల్ చేయాలని సిటిజన్ ఛార్టర్‌లో ప్రభుత్వం తెలిపింది.
కుల, ఆదాయ, బర్త్ సర్టిఫికెట్లకు ఎంత పెరిగిందంటే..
- ఇన్‌కం సర్టిఫికేట్‌కు మొన్నటి వరకు రూ.45-రూ.55 ఉండగా.. ఛార్జీల పెంపు తర్వాత రూ.80కి చేరింది.
- కుల ధ్రువీకరణ పత్రానికి గతంలో రూ.45 నుంచి 55 ఉండగా.. ఇప్పుడు రూ.80కి చేరింది.
- స్థానికత ధ్రువీకరణ పత్రం గతంలో రూ.45 నుంచి రూ.55 ఉండగా.. ప్రస్తుతం రూ.80కి పెంచారు.
- అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ గతంలో రూ.40- 45 ఉండగా.. తాజాగా రూ.62కు పెంచారు.
telangana meeseva usage charges increased by 50 percent
ఈ ఛార్జీల పెంపుతో.. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు అఫ్లయ్ చేసుకునే సమయంలో విద్యార్థులు కుల, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వీటిన ధరలను ఏకంగా 80 రూపాయలకు పెంచడం వల్ల ఇది మధ్యతరగతి, పేద వర్గాల విద్యార్థులపై భారంగా మారనుంది. వీటితో పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆర్టీఏ సేవలు, ఇతర ప్రభుత్వ అఫ్లికేషన్లపై కూడా అదనపు భారం పడనుంది.
