Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు.. లబ్ధిదారులకు భారీ ప్రయోజనాలు!
Telangana Govt : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉన్న డబుల్ బెడ్ రూమ్ నిబంధనలు అమలు చేస్తూనే.. ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
Indiramma Housing Scheme
Indiramma Housing Scheme : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉన్న డబుల్ బెడ్ రూమ్ నిబంధనలు అమలు చేస్తూనే.. ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా భవన నిర్మాణాలకు అనుమతులు ప్రక్రియ మరింత సులభతరం అయ్యేలా ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) కోసం తెలంగాన హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ధరలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.
Also Read : Ration Card E-KYC: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పది రోజులే గడువు.. లేదంటే రేషన్ కార్డు క్యాన్సిల్
ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఈ పథకం కింద భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, భవన అనుమతులకు సంబంధించిన దాదాపు అన్ని రకాల ఫీజులు, అభివృద్ధి ఛార్జీలు, ఇంపాక్ట్ ఫీజులు తదితర రుసుములపై 100శాతం మినహాయింపు కల్పించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతులు వేగంగా లభించే అవకాశం ఏర్పడింది.
సింగిల్ విండో కమిటీ ఏర్పాటు..
ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పథకంలో భవన నిర్మాణాలకు అవసరమైన అన్నిశాఖల అనుమతులు ఒకే వేదికపై, నిర్ణీత గడువులో అందించేలా ప్రభుత్వం తెలంగాణ హౌసింగ్ బోర్డు అఫోర్డబుల్ అర్బన్ హౌసింగ్ సింగిల్ విండో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్పర్సన్గా వ్యవహరించనుండగా, హౌసింగ్ శాఖ, తెలంగాణ హౌసింగ్ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, డీటీసీపీ, ఫైర్ సర్వీసులు, వాటర్ బోర్డు, విద్యుత్ సంస్థలు, కాలుష్య నియంత్రణ మండలి, టీజీ-రెరా అధికారులు సభ్యులుగా ఉంటారు. బిల్డ్స్ పోర్టల్ ద్వారా ఒకే దరఖాస్తుతో భవన అనుమతులు, లేఅవుట్ అనుమతులు, వివిధ శాఖల నుంచి అవసరమైన ఎన్వోసీలు పొందే అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో లోపాలు ఉంటే ఒకేసారి తెలియజేయడం, చట్టపరంగా వీలున్న చోట డీమ్డ్ అప్రూవల్ ఇవ్వడం, నీరు, మురుగు, విద్యుత్, రహదారులు, అగ్నిమాపక సదుపాయాల సమన్వయం వంటి బాధ్యతలను ఈ కమిటీ నిర్వహించనుంది.
100 శాతం ఫీజు మినహాయింపు..
ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పథకంలోని ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ గృహాలకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఈ కేటగిరీలకు కింది రుసుములపై పూర్తిస్థాయిలో మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భవన అనుమతి, ఫీజు స్క్రూటినీ ఫీజు, డెవలప్మెంట్ ఛార్జీలు, బెటర్మెంట్ ఛార్జీలు, లేఅవుట్ అనుమతి రుసుము , ల్యాండ్ యూజ్ కన్వర్షన్ ఛార్జీలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఫీజు , సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు, ఫైర్ సర్వీస్ ఎన్వోసీ ఫీజు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఛార్జీలు, సీఆర్ఎంపీ రోడ్డు ఛార్జీలు, పట్టణ స్థానిక సంస్థలు లేదా ప్రణాళికా సంస్థలు విధించే ఇతర భవన అనుమతి సంబంధిత రుసుములు ఉన్నాయి. అయితే, ఈ మినహాయింపు తెలంగాణ హౌసింగ్ బోర్డు అమలు చేసే ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ గృహాలకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొన్ని నిబంధనలు తప్పనిసరి..
ఫీజు మినహాయింపులు ఉన్నప్పటికీ నిర్మాణ భద్రత, అగ్నిమాపక భద్రత, పర్యావరణ అనుమతులు, విమానయాన శాఖ అనుమతులు వంటి చట్టబద్ధ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల ప్రకారం.. చెల్లించాల్సిన పన్నులు, సెస్సులు, విద్యుత్, నీటి వంటి యుటిలిటీ సేవల ఛార్జీలకు ఈ మినహాయింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
