Rain Alert : రుతుపవనాలు మళ్లీ వస్తున్నాయ్.. వారంరోజులు ఈ జిల్లాల్లో వానలేవానలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ
Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Telangana rains
Rain Alert : దేశంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో రైతులు సాగు పనుల్లో ముందుకెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినప్పటికీ జూన్, జులై నెలల్లో సాధారణ వర్షపాతంకూడా నమోదుకాలేదు. దీంతో రైతులు వర్షాలకోసం ఆకాశంవైపు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రుతుపవనాలు మళ్లీ వస్తున్నాయని.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వారం రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read : Gold And Silver Prices Today : బంగారం కొనుగోలుదారులకు అలర్ట్.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడిన కారణంగా రుతుపవనాలు తిరిగి బలంగా పుంజుకోవడానికి సిద్ధమవుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఈనెల 22వ తేదీ వరకు వర్షాలు కురవనున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా – బెంగాల్ తీరాల్లో అల్పపీడనం బలపడిందని, కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, వర్షాల సమయంలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతున్నందున రాష్ట్రంలో నాలుగైదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాలు కురుస్తున్న సమయంలో, ఈదురుగాలులు సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
నేడు (సోమవారం) మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్ధిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
