Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు..
Trainee IPS Officer Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Trainee IPS Officer Uday Krishna Reddy
Trainee IPS Officer Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఎస్ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఉదయ్ కృష్ణా రెడ్డిని నేషనల్ పోలీస్ అకాడమీ ((NPA) తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read : Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు.. లబ్ధిదారులకు భారీ ప్రయోజనాలు!
కృష్ణారెడ్డిపై ఆదివారం లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడంతోపాటు గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకొని గొంతు నులిమి, మెడపై కత్తిపెట్టి బెదిరించినట్లు కర్ణాటకకు చెందిన 30ఏళ్ల వివాహిత మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కృష్ణారెడ్డిపై బీఎస్ఎస్లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. ఎన్పీఏ ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ అంశంపై ఎనిమిది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు ట్రైనీ ఐపీఎస్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన తరువాత సొంతూరుకు వెళ్లిపోయిన కృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం మోతీనగర్ లోని స్నేహితుడి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నంకు పాల్పడటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లోని జయంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వివరాలు వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయ్ కృష్ణారెడ్డిని సోమవారం ఉదయం ఆయన స్నేహితులు, సోదరుడు కలిసి ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే ఉదయ్ స్పృహలో లేడని చెప్పారు. ఆయన స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్ నిన్నటి నుంచి అధికంగా మద్యం సేవించినట్లు సమాచారం ఉందన్నారు. రోగికి వెంటనే స్టమక్ వాష్ (కడుపు శుభ్రపరిచే చికిత్స) నిర్వహించి అత్యవసర చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఇంకా స్పృహలోకి రాలేదని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాలంటే కనీసం మరో 24 గంటలు గడవాల్సి ఉంటుందని డాక్టర్ రవి శంకర్ రెడ్డి తెలిపారు. ఘటనాస్థలంలో శానిటైజర్ పక్కనే ఒక ఆల్కహాల్ బాటిల్ కనిపించిందని, అయితే ఉదయ్ ఏ ద్రవాన్ని సేవించారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అందిస్తున్న చికిత్సకు ఉదయ్ కృష్ణారెడ్డి శరీరం స్పందిస్తోందని, వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ రవి శంకర్ రెడ్డి వెల్లడించారు.
