×
Ad

Telangana Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు..! చుట్టూ కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. బోటింగ్.. వావ్.. తక్కువ ఖర్చుతో సరికొత్త అనుభూతి

Telangana Mini Maldives : నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిలను తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలుస్తారు. జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా సోమశిలకు అవార్డు కూడా దక్కింది.

Telangana Mini Maldives

  • తెలంగాణ పర్యాటకానికే మణిహారం సోమశిల
  • కృష్ణమ్మ తీరాన మినీ మాల్దీవులు
  • రిసార్ట్స్, బోటింగ్‌తో సరికొత్త అనుభూతి

Telangana Mini Maldives : వీకెండ్‌లో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. వరుస సెలవుల్లో మాల్దీవులు లాంటి ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు.. తెలుగు రాష్ట్రాలు దాటి ఎక్కడికి వెళ్లినా ఖర్చుతో కూడుకున్న యాత్రే అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే వారు తక్కువ బడ్జెట్‌లో మాల్దీవులను చూసి ఫీలింగ్ పొందడానికి ఓ ఆహ్లాదకరమైన ప్రదేశం ఉంది. అదే తెలంగాణ మినీ మాల్దీవులు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిలను తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలుస్తారు. జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా సోమశిలకు అవార్డు కూడా దక్కింది.

Also Read : Semi Bullet Train : రూటు మారింది.. అమరావతికి గంటన్నరలోపే.. గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కనే సెమీ బుల్లెట్ ట్రైన్..

కృష్ణా నది బ్యాక్ వాటర్స్ అందాలతో ముస్తాబైన ఈ ప్రాంతం, ఇప్పుడు పర్యాటకులకు మినీ మాల్దీవులుగా మారిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కొల్లాపూర్ సమీపంలో ఉన్న సోమశిల గ్రామం వద్ద కృష్ణా నది ఒక సముద్రాన్ని తలపిస్తుంది. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ ఇక్కడ భారీ జలాశయంగా కనిపిస్తాయి. నల్లమల అటవీ శ్రేణుల మధ్యలో ఈ నీటి ప్రవాహం పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తోంది. నగర జీవన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి సోమశిల ఒక ఫర్ఫెక్ట్ డెస్టి‌నేషన్ అని చెప్పొచ్చు.

సోమశిల ప్రాంతాన్ని పర్యాటకులను మంత్రముగ్దులను చేసేలా తీర్చిదిద్దారు. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే.. మళ్లీమళ్లీ రావాలనిపించేలా ఈ ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులు కల్పించారు. నది తీరాన నిర్మించిన హరిత రిసార్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నదికి ఎదురుగా ఉండే కాటేజీల కిటికీల నుంచి చూస్తే నీటి అలలు పాదాలను తాకుతున్నాయా..? అన్నంత దగ్గరగా ప్రకృతి కనిపిస్తుంది. ఇక్కడ బోటింగ్ ప్రయాణం అత్యంత సాహసోపేతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండల మధ్య నీటిలో పడవలో ప్రయాణిస్తుంటే తియ్యని అనుభూతి కలుగుతుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రూయిజ్ బోట్లు పర్యాటకులను అద్దాల మర్రి వంటి సమీప ప్రాంతాలకు తీసుకెళ్తాయి.

సోమశిల కేవలం విహారయాత్రకే పరిమితం కాదు.. ఆధ్యాత్మిక ప్రాంతం కూడా. ఇక్కడ వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఇక్కడ 12 శివలింగాలు కొలువై ఉండటం విశేషం. ప్రతీ సంవత్సరం పుష్య బహుళ అమావాస్య రోజున ఇక్కడ జరిగే జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు.

సోమశిల ప్రాంతం హైదరాబాద్ నుంచి సుమారు 170 నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సొంత వాహనాల్లో వచ్చేవారు కొల్లాపూర్ మీదుగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో విదేశీ పర్యాటక అనుభూతిని పొందవచ్చునని ఇక్కడికి వచ్చే పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్స్‌లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హరిత రిసార్ట్స్‌లో బస చేయాలనుకునేవారు ముందుగానే ఆన్‌లైన్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.