Telangana Government : మొన్న గద్దర్ అవార్డులు.. ఇప్పుడు పీవీ నరసింహారావు అవార్డులు.. తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్..
ఇప్పుడు పీవీ నరసింహారావు పేరిట టీవీ పరిశ్రమకు కూడా తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. (Telangana Government)
Telangana Government
Telangana Government : సినీ పరిశ్రమకు అవార్డులు అనేవి ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. గతంలో ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు అధికారికంగా ఇచ్చేవారు. రాష్ట్రం విడిపోయాక ఆ అవార్డులు ఆగిపోయాయి. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట రాష్ట్ర అవార్డులు ప్రకటించి ఇస్తున్నారు. తెలంగాణ గద్దర్ అవార్డులు అంటూ సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తరపున అవార్డులు ఇస్తున్నారు.
అయితే ఇప్పుడు పీవీ నరసింహారావు పేరిట టీవీ పరిశ్రమకు కూడా తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టెలివిజన్ అవార్డు కమిటీని ఏర్పాటు చేసి అవార్డుల రూపకల్పనపై చర్చలు జరిపారు. అవార్డు లోగో, పేరు, కేటగిరీలు, ఎంపిక విధానం వంటి అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు.
Also Read : Chiranjeevi : ఏపీ ప్రభుత్వం కోసం కీలకంగా మెగాస్టార్..? నిజమేనా?
ఈ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ.. అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని, మాజీ ప్రధాన మంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు పేరును బుల్లితెర అవార్డులకు పెట్టాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని, ఈ అవార్డుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని అన్నారు. ప్రేక్షకులకు వినోదంతో పాటు సామాజిక సందేశాలను కూడా టెలివిజన్ రంగం అందిస్తుంది. నటీనటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, యాంకర్లు, నిర్మాతలు, బాలల కార్యక్రమాలు, సామాజిక సందేశంతో కూడిన సీరియల్స్.. ఇలా అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సహించేలా కేటగిరీలను రూపొందించాలని కమిటీకి తెలిపారు.
అలాగే ఈ టీవీ అవార్డుల ప్రదానోత్సవాన్ని సినిమా అవార్డులలాగే ఘనంగా నిర్వహిస్తామని అందుకు 2 లేదా 3 వేదికలు కూడా ప్రతిపాదించాలని కమిటీ సభ్యులను కోరారు మంత్రి. దీంతో త్వరలోనే పీవీ నరసింహారావు పేరిట టెలివిజన్ అవార్డులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
