Hyderabad : ఫిర్యాదు చేసేందుకు వెళితే రేప్ చేశారు..! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
Jubilee Hills PS : విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఓ వివాహిత తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటువేసినట్లు తెలిసింది.
Jubilee Hills PS
Hyderabad : విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఓ వివాహిత తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఠాణా బాధ్యతలు చేపట్టిన ఆయన.. నాలుగు నెలల్లోనే సస్పెన్షన్‌కు గురికావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Also Read : Tamil Nadu : రూ.15వేలు ఇస్తామని మహిళలకు గుండు గీయించిన వ్యక్తి.. చివరిలో బిగ్ ట్విస్ట్..
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై ఓ వివాహిత తీవ్ర ఆరోపణలు చేస్తూ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేసింది. కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనను భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ ఘటనను వీడియోగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. శ్రీనివాసులు రెడ్డి అమీన్పూర్ సీఐగా పనిచేస్తున్న సమయంలో కుటుంబ వివాదాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా తనపై లైంగిక దాడి జరిగిందని పేర్కొంది. ఆయన కారణంగా తాను గర్భం దాల్చానని, అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లి బలవంతంగా గర్భస్రావం చేయించారని ఆరోపించింది. ఆస్పత్రి రికార్డుల్లో తన ఫోన్ నంబర్‌ను నమోదు చేయించారని కూడా తెలిపింది. వీడియోలను అడ్డం పెట్టుకొని బెదిరిస్తూ ఇప్పటి వరకు తన నుంచి సుమారు రూ.2కోట్ల వరకు వసూళ్లు చేశారని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ లావాదేవీల వివరాలను ఆధారాలుగా జతచేసినట్లు తెలిపింది.
తనను వదిలేయాలని వేడుకున్నప్పటికీ శారీరకంగా హింసించారని కూడా ఫిర్యాదులో మహిళ పేర్కొంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్ విచారణ బాధ్యతలను మల్టీజోన్ ఐజీ షానవాజ్ ఖాసీంకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదును అధికారికంగా నమోదు చేయాలని వెస్ట్‌జోన్ డీసీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదులో చేసిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని డీసీపీ తెలిపారు.
కాగా.. ఆ మహిళే తనను పలుమార్లు బెదిరించి డబ్బు కాజేసిందని సదరు ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఇదిలాఉండగా.. మహిళ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు సదరు సీఐపై సస్పెన్షన్ వేశారు. రాజేంద్రనగర్ సీఐ ముత్తు యాదవ్ ను జూబ్లీహిల్స్ సీఐగా బదిలీ చేశారు.
