విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేలా ఉండటంతో బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాల హక్కులకు కూడా బిల్లుతో తీవ్ర భంగం కలుగుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేలా బిల్లు ఉందని విమర్శించారు. సమాఖ్య ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధంగా కేంద్రం తీరు లేదని అసహనం వ్యక్తం చేశారు.
డిస్కమ్ లకు 9.5 శాతం వడ్డీతో అప్పు ఇస్తామన్నారని..8.5 శాతం ఇస్తే బాగుంటుందని తాము సూచించామని తెలిపారు. విద్యుత్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, రాజస్థాన్ మన అభిప్రాయాలతో ఏకీభవించాయని చెప్పారు. మార్పులు చేస్తామని కేంద్రం చెప్పింది.. కానీ చేతల్లో కనిపించలేదని విమర్శించారు. సవరించిన ముసాయిదా తమకు అందలేదన్నారు.
విద్యుత్ బిల్లుపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని.. వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికీ, ప్రజలకూ ఉపయోగపడే విధంగా బిల్లు లేదని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రాయితీలు పొందే వారికి, రైతాంగానికి బిల్లుతో తీవ్ర నష్టం వస్తుందన్నారు. చిన్న చిన్న వినియోగాదారులు సబ్సిడీలను కోల్పోతారని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్ కు 270 మెగావాట్లు అనుసంధానించామని తెలిపారు. రెండో ప్లాంటు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని అన్నారు. కొందరు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. మరో నెలన్నరలో మూడో యూనిట్ ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. భద్రాద్రిలో పూర్తి స్థాయిలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.