అంబానీకి, ఆదానికి దోచి పెడుతున్నది నిజం కాదా?: కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్

పొద్దున లేస్తే మందు, మాంసం లేకుంటే ఉండలేనోళ్లు హిందూధర్మం గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేయండి అంటే.. ఇంటింటికీ రాముని ఫోటోలు అక్షింతలు పంపిస్తారా?

Ponnam Prabhakar: కాంగ్రెస్ గ్యారెంటీల గురించి అడిగే బీజేపీ నేతలు.. పదేళ్లలో కేంద్రంలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకోని కేంద్రంలో నాయకులు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాని ప్రశ్నించారు.

”అంబానీకి, ఆదానికి దోచి పెడుతున్నది నిజం కాదా? తెలంగాణ ఏర్పాటును అవమానించింది నిజం కాదా? అని నిలదీశారు. నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా విభజన హామీలు అమలు చేయలేదు. చేనేత వస్త్రాలపై 12% జీఎస్టీ విధించారు. నా తల్లిని అవమానించేలా బండి సంజయ్ మాట్లాడారు. ఆనాడు కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే దానిపై గెలిచిన బండి సంజయ్.. నా తల్లిపై మాట్లాడి రాజకీయ సమాధి కట్టుకున్నాడు.

ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉండి ఏం చేసావ్? నీ అవినీతి వల్లే రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిందని కిషన్ రెడ్డి లాంటి వాళ్లే కోడై కూస్తున్నారు. మోదీ ఏమైనా మంచి పనులు చేస్తే ఆయన ఫోటోతో ఓట్లు అడగండి. కానీ రాముని ఫోటోతో కాదు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలి. ప్రకృతి వైపరిత్యాలతో, కరువుతో నష్టపోయిన రైతులను కేంద్రం ఎందుకు ఆదుకోవడం లేదు? ఎన్నికలు రాగానే ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ ఐదేళ్లు ఎక్కడికిపోయాడు?

Also Read: ఎన్నికల్లో ఇదే జరిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

పొద్దున లేస్తే మందు, మాంసం లేకుంటే ఉండలేనోళ్లు హిందూధర్మం గురించి మాట్లాడుతున్నారు. మీరు అమలు చేయని హామీలపై చర్చకు బీజేపీ నేతలు సిద్దమా? ఒక్క వైద్య కాలేజీ కూడా ఇవ్వడానికి మనసు రాలేదా ? నా తల్లి గురించి మాట్లాడిన వ్యక్తి రాజకీయంగా సమాధి కావాల్సిందే? కరీంనగర్ ఎంపీ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. బండి సంజయ్ వల్ల కరీంనగర్ పరువు పోయింది. అభివృద్ధి చేయండి అంటే.. ఇంటింటికీ రాముని ఫోటోలు అక్షింతలు పంపిస్తారా” అంటూ మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. కాగా, నిరసన దీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు