×
Ad

రోజుకో ఇష్యూ.. సీఎం, పీసీసీ చీఫ్‌ జోక్యం చేసుకున్నా తెగని పంచాయితీ.. అక్కడితో ఆగకుండా..

ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి వ‌రంగ‌ల్ జిల్లాలో ఎమ్మెల్యేల‌ను, ఇత‌ర నేత‌ల‌ను..కొండా సురేఖ‌పైకి ఎగ‌దోశారని భావిస్తున్నారట.

Seethakka

Congress party: తెలంగాణ క్యాబినెట్ మంత్రుల మ‌ధ్య నిత్యం ఏదో ఒక వివాదం న‌డుస్తూనే ఉంది. ఒక స‌మ‌స్య ముగిసింద‌నుకుంటున్న టైమ్‌లోనే మ‌రొక‌ వివాదం తెర‌పైకి వ‌చ్చి..ఇష్యూగా మారుతోంది. ఒక‌రిని ఒక‌రు విమ‌ర్శించుకుంటూనే..పార్టీ అధిష్టానంకు కూడా పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

ఢిల్లీకి లేఖ‌లు వెళ్తుండ‌టంతో పార్టీలో, ప్రభుత్వంలో ఏం జ‌రుగుతుంద‌నే దానిపై అధిష్టాన పెద్దలు ఆరా తీస్తున్నార‌ట‌. అస‌లు మ్యాటరేంటో తెలుసుకునేందుకు పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్‌ను ఢిల్లీకి పిలిపించార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న పార్టీ హైకమాండ్..మంత్రుల విష‌యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. (Congress party)

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల్లో పొన్నం ప్రభాక‌ర్, వివేక్ వెంక‌ట‌స్వామి క్లోజ్‌గా ఉంటున్నారట. అడ్లూరి ల‌క్ష్మణ్‌, శ్రీధ‌ర్‌బాబు ఒక వర్గంగా మారరట. ఈ రెండు గ్రూప్‌ల మ‌ధ్య కోల్డ్ వార్‌..జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌ మీటింగ్‌ సందర్భంగా బరస్ట్ అయింది. జూబ్లీహిల్స్ మైనార్టీ మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాక‌ర్ మ‌రో మంత్రి అడ్లూరి ల‌క్ష్మణ్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. ఇది పెద్ద వివాదం అయింది. చివ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌తో పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ జోక్యం చేసుకొని ఇద్దరు మంత్రుల‌ను పిలిచి మాట్లాడారు.

ఆ దుమారం ముగిసిందనుకునే టైమ్‌లో మరో వివాదం..
పొన్నం ప్రభాక‌ర్‌తో మంత్రి అడ్లూరి ల‌క్ష్మణ్‌కు క్షమాప‌ణ‌లు చెప్పారు. ఇంత‌టితో దున్నపోతు వ్యాఖ్యల దుమారం ముగిసిందనుకునే టైమ్‌లో..కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య మేడారం టెండర్ల వార్ తెరపైకి వచ్చింది. ఓరుగల్లు ఎపిసోడ్ నడుస్తుండగానే..మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి కామెంట్స్‌తో మరోసారి కరీంనగర్ మంత్రుల పంచాయితీ కాక రేపుతోంది.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జ‌రిగిన మాలల ఐక్య స‌ద‌స్సు మీటింగ్‌లో మంత్రి వివేక్.. అడ్లూరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అడ్లూరి కులం ఆధారంగా కుట్రలు చేస్తున్నార‌ని.. అడ్లూరి వెనుక మ‌రో మంత్రి శ్రీధ‌ర్‌బాబు ఉన్నార‌నేలా వివేక్ మాట్లాడుకొచ్చారు. దీనిపై అడ్లూరి స్పందిస్తూ..వివేక్ కామెంట్స్‌ను పార్టీ అధిష్టానం చూసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు. ఈ వివాదంలో మంత్రులు పొన్నం ప్రభాక‌ర్‌, వివేక్‌పై గతంలోనే మంత్రి శ్రీధ‌ర్ బాబు కామెంట్స్ చేశారు.

ఇక లేటెస్ట్‌గా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా మేడారం అభివృద్ధి పనుల విష‌యంలో మంత్రుల మ‌ధ్య వివాదం చోటు చేసుకుంది. తనకు సంబంధం లేకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప‌నులు చేయిస్తున్నార‌ని.దేవాదాయశాఖ మినిస్టర్..ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ‌..గుర్రుగా ఉన్నారు. త‌న శాఖ‌కు సంబంధించిన ప‌నుల్లో పొంగులేటి ఇంచార్జ్ మంత్రి హోదాలో జోక్యం చేసుకోవడంపై ఆమె సీరియస్‌గా ఉన్నారు. మరో మంత్రి సీత‌క్కతో క‌లిసి పార్టీ ముఖ్యనేత‌ల దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: నకిలీ మద్యం గుట్టుపై సిట్‌.. అసలు డొంక కదిలేనా? ఇప్పటివరకు ఏం జరిగింది? బుక్ అయ్యేదెవరు?

సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయ‌డంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు కూడా లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. అయితే వ‌రంగ‌ల్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, మంత్రి కొండా సురేఖ‌కు మధ్య చాలా కాలంగా గ్యాప్ నడుస్తోందట.

ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి వ‌రంగ‌ల్ జిల్లాలో ఎమ్మెల్యేల‌ను, ఇత‌ర నేత‌ల‌ను..కొండా సురేఖ‌పైకి ఎగ‌దోశారని భావిస్తున్నారట. ఈ విష‌యంలో గ‌తంలో మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు మేడారం ప‌నుల విష‌యంలో వివాదం మ‌రింత ముదిరింది. ఆఖ‌రికి మేడారం అభివృద్ధి ప‌నుల‌ స‌మీక్షా సమావేశానికి..పొంగులేటి మేడారం టూర్‌కు కూడా మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండిపోయారు.

ఇలా క్యాబినెట్ మంత్రుల మ‌ధ్య మ‌న‌స్పర్ధలు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకొని స‌మ‌స్యల‌ను స‌ర్దుబాటు చేస్తున్నా..మంత్రులు ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం రోజుకొక ట‌ర్న్ తీసుకుంటుండటంతో పార్టీ అధిష్టానం కూడా ఏం జ‌రుగుతుంద‌ని ఆరా తీస్తోందట.

రోజుకో ఇద్దరు మంత్రులు రచ్చకెక్కడం..పోటాపోటీగా ఫిర్యాదు చేసుకోవడం అధిష్టానం తలనొప్పిగా మారిందట. అందుకే పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌ను ఢిల్లీకి పిలిపించుకుని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారట పార్టీ పెద్దలు. మంత్రుల పంచాయితీని స్వయంగా అధిష్టానమే డీల్ చేస్తుందట. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసేందుకు కొందరు అమాత్యులను ఇప్పటికే మందలించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.