Phone Tapping Case : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి విచారించిన సిట్ అధికారులు.. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం మంగళవారం (27వ తేదీ) మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంకు హాజరు కావాలని నోటీసుల్లో సిట్ బృందం పేర్కొంది.
Also Read : Badrinath-Kedarnath Temple : ‘కేవలం హిందువులకు మాత్రమే ఆ ఆలయాల్లోకి ప్రవేశం..’
సిట్ నోటీసులపై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత సంతోష్ రావు స్పందించారు. రేపటి సిట్ విచారణకు హాజరవుతా, సిట్ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పలువురు అధికారులతోపాటు ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన చార్జిషీటు దాఖలు చేశామని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ ఇప్పటికే వెల్లడించారు.
ఇదిలాఉంటే సిట్ నెక్ట్స్ నోటీసులు ఎవరికన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె కవితలకు కూడా సిట్ నోటీసులు ఇస్తుందన్న టాక్ నడుస్తోంది. కవితను సిట్ కార్యాలయంకు పిలిచి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తారని, ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను విచారిస్తారని టాక్ నడుస్తోంది. అయితే, విచారణ సమయంలో హరీశ్ రావు, కేటీఆర్ చెప్పిన విషయాలు, సంతోష్ రావు చెప్పబోయే సమాధానాలపై ఓ అవగాహన రానున్న సిట్ బృందం ఆ తరువాత ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణనను మరింత వేగం పెంచబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి క్లైమాక్స్ లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠతను రేపుతోంది.