Badrinath-Kedarnath Temple : ‘కేవలం హిందువులకు మాత్రమే ఆ ఆలయాల్లోకి ప్రవేశం..’

Badrinath-Kedarnath Temple : ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్ టెంపుల్‌ కమిటీ ప్రతిపాదించింది.

Badrinath-Kedarnath Temple : ‘కేవలం హిందువులకు మాత్రమే ఆ ఆలయాల్లోకి ప్రవేశం..’

Badrinath-Kedarnath Temple

Updated On : January 26, 2026 / 6:47 PM IST
  • బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో హిందూయేతరులకు ప్రవేశం బంద్
  • ప్రతిపాదించిన ఆలయ కమిటీ బోర్డు
  • త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం

Badrinath-Kedarnath Temple : ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల దర్శన విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇకనుంచి ఈ ఆలయాల్లో హిందువులను మాత్రమే అనుమతించాలని, హిందూయేతరుల ప్రవేశంపై నిషేదం విధించాలని బద్రీనాథ్ – కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (BKTC) ప్రతిపాదించింది. త్వరలోనే జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడనుంది.

Also Read : యూజీసీ ఈక్విటీ రూల్స్‌పై జనరల్ కేటగిరీ విద్యార్థుల్లో ఆగ్రహ జ్వాల.. ఎందుకు ఇంతగా వివాదం చెలరేగుతోంది?

ఈ అంశంపై బద్రీనాథ్ – కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది మాట్లాడుతూ.. బద్రీనాథ్ – కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాలతోపాటు కమిటీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తించనున్నట్లు తెలిపారు. త్వరలో జరిగే బోర్డు మీటింగ్‌లో ఆమోదముద్ర వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గంగోత్రి ధామ్‌లోకి హిందూయేతరులు ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన శ్రీ గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బద్రీనాథ్ – కేధార్‌నాథ్ ఆలయ ప్రవేశాలపైనా ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఆలయాల సంస్కృతిని పరిరక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే.. ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.

ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నాలుగు ధామాలను కలిపి చార్‌ధామ్ అంటారు. హిందువులకు ఈ యాత్ర ఎంతో ప్రత్యేకం. చార్‌ధామ్ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభించి, తరువాత గంగ్రోతి, కేదార్‌నాథ్, చివరగా బద్రీనాథ్ దర్శనంతో ముగుస్తుంది. చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాలను ప్రతీయేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు.

శీతాకాలం నేపథ్యంలో ఆరు నెలల పాటు మూసి ఉంచిన బద్రీనాథ్ ఆలయం ద్వారాలను ఏప్రిల్ 23న తెరవనున్నారు. ఇక గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకొని ఏప్రిల్ 19న తెరుచుకోనున్నాయి.