యూజీసీ ఈక్విటీ రూల్స్‌పై జనరల్ కేటగిరీ విద్యార్థుల్లో ఆగ్రహ జ్వాల.. ఎందుకు ఇంతగా వివాదం చెలరేగుతోంది?

తప్పుడు ఫిర్యాదులు, వాటి వల్ల నిర్దోషులపై పడే ప్రభావం గురించి పట్టించుకోలేదని జనరల్ కేటగిరీ విద్యార్థులు అంటున్నారు.

యూజీసీ ఈక్విటీ రూల్స్‌పై జనరల్ కేటగిరీ విద్యార్థుల్లో ఆగ్రహ జ్వాల.. ఎందుకు ఇంతగా వివాదం చెలరేగుతోంది?

UGC (Image Credit To Original Source)

Updated On : January 26, 2026 / 3:25 PM IST
  • యూజీసీ కొత్త రెగ్యులేషన్స్-2026పై వివాదం
  • ఈ ఫ్రేమ్‌వర్క్ బాగోలేదంటున్న జనరల్‌ కేటగిరీ విద్యార్థులు
  • తమపై వివక్షకు దారితీసేలా ఉందని ఆవేదన 

New UGC law: విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) కొత్తగా నోటిఫై చేసిన “ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్” రెగ్యులేషన్స్-2026పై జనరల్ కేటగిరీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ కొత్త నిబంధనలకు సంబంధించిన ఈ ఫ్రేమ్‌వర్క్ కుల ఆధారిత పక్షపాతాన్ని పరిష్కరించేటప్పుడు తమపై వివక్షకు దారితీసేలా ఉందని అంటున్నారు.

ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని అమలు చేసే విధానాలపై రూపొందించిన ఈక్విటీ ప్రోత్సాహ నిబంధనలు-2026ను యూజీసీ జనవరి 15న ప్రకటించింది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020లో పేర్కొన్న “ఈక్విటీ, ఇన్‌క్లూజన్” లక్ష్యాల ఆధారంగా రూపొందింది.

ఈ నిబంధన కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వివక్షపై ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగత విధానాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. గతంలో డౌరీ యాక్ట్, ఎస్సీ-ఎస్టీ యాక్ట్ అమలులో దుర్వినియోగం జరిగిందన్న ఉదాహరణలు చూపుతూ, ఇదే పరిస్థితి మళ్లీ తమకూ తలెత్తుతుందనే భయాన్ని జనరల్ కేటగిరీ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది.. ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

నిబంధనల్లో ఏముంది?
యూజీసీ ఈక్విటీ ప్రోత్సాహ నిబంధనలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, సంస్థల అధిపతులు అన్నివర్గాలకు వర్తిస్తాయి. వివక్ష నిర్వచనంలో ప్రత్యక్ష చర్యలు, పరోక్ష చర్యలు రెండూ ఉంటాయి.

ఉన్నత విద్యా సంస్థల్లో ఎవరినైనా ఇతరులతో సమానంగా చూడకుండా భిన్నంగా, అన్యాయంగా ప్రవర్తిస్తే లేదా వారి గౌరవాన్ని దెబ్బతీస్తే వివక్షగా పరిగణిస్తారు. అయితే, ఈ నిబంధన ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు, దివ్యాంగులపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే ఉన్నాయి. ఓబీసీలకు 1990 నుంచి ప్రవేశాల్లో, 2010 నుంచి నియామకాలలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయినా కూడా వారి భాగస్వామ్యం 15 శాతానికి మించలేదని యూజీసీ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ ముందు, సుప్రీంకోర్టు ముందు సమర్పించిన యూజీసీ గణాంకాల ప్రకారం గత 5 ఏళ్లలో విద్యాసంస్థల్లో కుల వివక్ష కేసులు 118.4 శాతం పెరిగాయి.

అయితే, యూజీసీ కొత్త నిబంధనలు సమతుల్యత, సంస్థాగత న్యాయం విషయంలో సందేహాలు కలిగిస్తున్నాయి. తప్పుడు ఫిర్యాదులు, వాటి వల్ల నిర్దోషులపై పడే ప్రభావం గురించి ఈ నిబంధనలో పట్టించుకోలేదని జనరల్ కేటగిరీ విద్యార్థులు అంటున్నారు.

నిబంధనల ప్రకారం కమిటీ నివేదికపై అసంతృప్తి ఉన్నవారు 30 రోజుల్లో అప్పీల్ దాఖలు చేయవచ్చు. ఆ అప్పీల్‌పై ఒంబుడ్స్‌మన్ 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. అయితే తప్పుడు ఆరోపణలు చేసినవారిపై శిక్షాత్మక చర్యలపై స్పష్టమైన నిబంధనలు లేవు. దీని వల్ల ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి ఆధారాలు లేకున్నా జనరల్ క్యాస్ట్ వ్యక్తిపై కేసు పెట్టి జైలుకు పంపే ప్రమాదం ఉందనే భయం వ్యక్తమవుతోంది.