పోలీసుల పైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత కోసం ఖాకీల వేట

  • Publish Date - July 4, 2020 / 10:55 AM IST

వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీహిల్స్ పోలీసు బృందం ఏపీలోని విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్ల దగ్గర తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లో విల్లా యజమానిపై దౌర్జన్యం వివాదంతో పాటు విచారణకు వెళ్లిన పోలీసులపైకి పెంపుడు కుక్కలను ఉసిగొల్పిన విషయంలో పీవీపీపై 2 కేసులు నమోదైన విషయం తెలిసిందే.

పీవీపీపై రెండు కేసులు:
పీవీపీపై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. ఒక విల్లా విషయంలో దాడి చేశారని పీవీపీ పై ఒక కేసు నమోదు కాగా, నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసిగొల్పారని మరో కేసు నమోదైంది. ఇటీవల 108 ప్రారంభోత్సవంలో పీవీపీ పాల్గొనడంతో ఆయన బెజవాడలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

విల్లా యజమానిపై దాడి:
కొన్ని రోజులక్రితం పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కైలాష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి భాగంలో నిర్మిస్తున్న రూఫ్ గార్డెన్‌ను అడ్డుకున్నారని, పీవీపీ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని కైలాష్ తన ఫిర్యాదులో తెలిపాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా, వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు. ఈ హఠాత్పరిణామంతో భయపడ్డ పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్‌ చేశారు.

Read:అంబులెన్సులు ఆరంభించడం అభినందనీయం…వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ట్రెండింగ్ వార్తలు