Current (1)
Telangana Power Demand : ఎండలు మండుతుండటంతో.. తెలంగాణలో విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 2022, మార్చి 29వ తేదీ మంగళవారం 14 వేల 117 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదైంది. సాయంత్రం వరకు విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో.. ఉదయం పది తర్వాత కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండ వేడి తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో.. విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. మార్చిలోనే ఇలా ఉంటే.. ముందు ముందు విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత పెరగనున్నాయి. అయితే.. 18 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా.. సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఉమ్మడి రాష్ట్రంలో 13 వేల 162 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్.. ఇప్పుడు మరింత పెరుగుతోంది. సౌత్ ఇండియాలో అత్యధిక వినియోగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా.. తమిళనాడు మొదటి రాష్ట్రంలో కొనసాగుతోంది.
Read More : Telangana : ఎండలే ఎండలు.. చరిత్రలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం వడ గాల్పులు దడ పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడ చూపినా ఇదే పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 2022, మార్చి 28వ తేదీ సోమవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల మార్చి ఉష్ణోగ్రతల్లో ఇది కొత్త రికార్డ్. 2016 మార్చి 18న భద్రాచలంలో 42.8, 2017 మార్చి 31న ఆదిలాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం మార్చిలోనే వేడి 43 డిగ్రీలకు చేరడంతో ఇక ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంగళవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీంతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండవేడి కారణంగా నల్గొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణం కన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడ గాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు.