×
Ad

TGSRTC : ప్రయాణీకులకు టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. త్వరలో ఆ కార్డులు వచ్చేస్తున్నాయ్.. వాళ్ల ఇబ్బందులు ఇక తొలగినట్లే..

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తూ.. కొత్తకొత్త సంస్కరణల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునేలా చర్యలు చేపడుతోంది.

TGSRTC

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తూ.. ఆదాయాన్ని పెంచుకునేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పండుగల సమయంలో ప్రత్యేక బస్సులను నడుపుతూ.. లక్కీడ్రాల ద్వారా బహుమతులు అందజేస్తూ.. ప్రయాణికులను ప్రైవేటు ట్రా వెల్స్ వైపు వెళ్లకుండా ఆకర్షించే కార్యక్రమాలను చేస్తోంది. తద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాక.. డీజిల్ బస్సులను తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుతూ వస్తోంది. అలాగే టికెటింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, చిల్లర సమస్య రాకుండా ఉండేందుకు కండక్టర్ ద్వారానే స్మార్ట్ టికెట్ ను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీసులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు 7,754 స్పెషల్ బస్సులు నడుపుతోంది. గత దసరా కంటే ఈ సారి రద్దీకి తగ్గట్లుగా అదనంగా 617 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. గతనెల 20 నుంచి ఈనెల 2 వరకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 5,6 తేదీల్లో తిరుగు ప్రయాణం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్న టీజీఎస్ఆర్టీసీ.. లక్కీడ్రాను ప్రకటించింది. ఈ లక్కీడ్రాలో మొదటి బహుమతి గెలుచుకున్నవారికి రూ.25 వేలు చెల్లించనుంది. రెండో బహుమతికి రూ.15 వేలు, మూడో బహుమతి కింద రూ.10 వేలు అందించనున్నారు. ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులు-సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్-ఏసీ, ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారు మాత్రమే ఈ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హులు. ప్రతి రీజియనకు ముగ్గురు చొప్పున మొత్తం 11 రీజియన్ల నుంచీ 33 మంది విజేతలను ఎంపిక చేయనుంది.

టీజీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టేందుకు యాజమాన్యం ఆలోచన చేస్తోంది. స్మార్ట్ కార్డుల విధానం బెంగళూరు, ముంబై, లక్నో వంటి నగరాల్లో అమల్లో ఉంది. అయితే, ఈ వ్యవస్థ గురించి అధ్యయనం చేయడానికి తెలంగాణ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. స్మార్టు కార్డు విధానాన్ని అమలు చేస్తే ఆర్టీసీకి పనిభారంతో పాటు భారీగా ఆదాయం రానుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.

రాష్ట్రంలోనూ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చి హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టి ముందుగా విద్యార్డుల బస్ పాస్‌లను స్మార్ట్ కార్డుల రూపంలోకి మార్చాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అనంతరం మిగిలిన పాస్ లతో పాటు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు వీటిని జారీ చేయాలనే ఆలోచనతో టీజీఎస్ఆర్టీసీ ఉంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షలకుపైగా విద్యార్థి బస్ పాస్ లు చెలామణిలో ఉన్నాయి. స్మార్ట్ కార్డు విధానం అందుబాటులోకి వస్తే.. విద్యార్థులు పాస్ రెన్యువల్ కోసం ప్రతినెల బస్ పాస్ జారీ చేసే కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం సమయంలో మహిళా ప్రయాణికుల నుంచి ఆధార్, ఇతర చిరునామా ధ్రువీకరణ కార్డుల అవసరం లేకుండానే బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఈ విధానం తీసుకొస్తే డిజిటల్ పద్ధతిలోనే రెన్యువల్ చేసుకోవ చ్చు. ఏ మార్గంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే వివరాలు ఆర్టీసీకి లభిస్తే మాత్రం మిగిలిన మార్గాల్లో బస్సులను సర్దుబాటు చేయడానికి వీలు ఉంటుంది.