Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త.. స్వయం ఉపాధి కల్పించేలా..
Telangana Govt : ఎస్సీ సామాజిక వర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- Harish Thanniru
- Published on- July 30, 2026 / 08:22 AM IST
Telangana CM Revanth Reddy
Telangana Govt : తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాల్లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పలు పథకాలను అమలు చేస్తోంది. తాజాగా.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గంకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 90, 70శాతం సబ్సిడీతో టూ, త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 వాహనాలు పంపిణీ చేయాలని.. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వీటిని పంపిణీ చేసేందుకు రూ.125.40కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 90శాతం సబ్సిడీ ఇవ్వనుండగా.. మిగతా 10శాతం లబ్ధిదారుడుకు బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది.
2025-26 ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ వెహికల్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అప్లికేషన్లు స్వీకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, వీటికిగాను లక్షల మందికిపైగా ఎస్సీ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ పథకంకు సంబంధించి అర్హతలు, గైడ్‌లైన్స్‌ను అధికారులు విడుదల చేశారు. 5,016 టూ వీలర్ ఈవీ (ఒక్కో వెహికల్ రూ.లక్ష)లకు, 2,508 త్రీ వీలర్స్ (ఒక్కో వెహికల్ రూ.3లక్షలు గూడ్స్, ఫ్యాసింజర్స్ ట్రాన్స్‌పోర్టు) ఇవ్వాలని యాక్షన్ ప్లాన్‌లో పొందుపర్చారు. రూ.లక్షలోపు ఉన్న టూ వీలర్‌కు 90శాతం సబ్సిడీ, 10శాతం బ్యాంక్ లోన్ లభించనుంది. రూ.4లక్షలలోపు ఉన్న త్రీవీలర్‌కు 70శాతం సబ్సిడీ, 30శాతం బ్యాంక్ లోన్ ఇవ్వనున్నారు.
