Hyderabad
Telangana Global Summit 2025 : విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు సర్వం సిద్ధమైంది. భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ప్యూచర్ సిటీలో వందలాది ఎకరాల విస్తీర్ణంలో రెండ్రోజులు జరిగే సమ్మిట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమ్మిట్ కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిథులు హాజరవుతున్నారు.
Also Read: Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. రియల్టర్‌పై కాల్పులు జరిపి.. కత్తితో పొడిచి హత్య
గ్లోబల్ సమ్మిట్ లో మొత్తం 27 అంశాలపై సెషన్లు నిర్వహించనున్నారు. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహించనున్నారు. సమ్మిట్ లో సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంతేకాక కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీతోపాటు ఒగ్గు డోలు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఈ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల కోసం తెలంగాణ సంస్కృతి తెలిపేలా ప్రభుత్వం ప్రత్యేక గిఫ్ట్‌లను రెడీ చేసింది.
సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులకోసం తెలంగాణ వంటకాలను రెడీ చేశారు. హైదరాబాదీ బిర్యానీతోపాటు డబుల్ కా మీఠా, పాయా, మటన్ కర్రీతో పాటు పలు వంటకాలను అతిథుల కోసం అందుబాటులో ఉంచనున్నారు. వంటకాలతోపాటు తెలంగాణ చిరుతిళ్లతో కూడిన ప్రత్యేక డైట్ కిట్ ను అతిథులకోసం రెడీ చేశారు. అందులో సకినాలు, నువ్వుల లడ్డూ, గారెలు, ఇప్పపువ్వులడ్డూ, మక్క పేలాలు తదితర తెలంగాణ ఫేమస్ చిరుతిళ్లు ఉన్నాయి.