Telangana: తెలంగాణలో కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ వేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ రెడీ అవుతోంది. ఈ పన్ను ద్వారా వచ్చిన డబ్బులను రోడ్డు ప్రమాదాల నివారణకు వినియోగించనున్నారు.
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తాజాగా రహదారి భద్రతకు సంబంధించిన సమావేశం జరిగింది. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. (Telangana)
ఆ కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సెఫ్రీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై ప్రత్యేక రోడ్డు భద్రతా సెస్ తీసుకొస్తున్నామని, దీన్ని రోడ్డు భద్రతా నిధి కోసం వాడతామని అధికారులు చెప్పారు.
Also Read: గ్రూప్-1 తీర్పుపై అప్పీలుకు టీజీపీఎస్సీ నిర్ణయం.. ఇకపై..
దీనికి ఇప్పటికే క్యాబినెట్‌లో ఆమోదముద్ర పడింది. త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీంతో దీని అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిధులను ట్రాఫిక్ అవగాహనపై ప్రచారంతో పాటు డ్రైవర్లకు హెల్త్ క్యాంప్‌లు, ఆధునిక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆధునిక పరికరాల వాడకం కోసం ఖర్చు చేస్తారు.
మరోవైపు, పోలీసు అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నేషనల్ హైవేలపై ప్రతిరోజు ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి, యాక్సిడెంట్ల నివారణకు రవాణా శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని అన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో గోల్డెన్ అవర్‌గా భావించే తొలి గంటలోనే ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు అందనున్న 2025 నగదు రహిత చికిత్స పథకంపై కూడా సమీక్ష జరిపారు. ఈ పథకం అమలుకు తెలంగాణ సర్కారు కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.