Tourism department: ప్రభుత్వ సొమ్మును తన ప్రియుడి బ్యాంకు ఖాతా వేస్తోంది ఓ ఉద్యోగిని. తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఉన్నతాధికారులను నివ్వెరపోయేలా చేసింది. ఆ శాఖలో శ్రుతి అనే ఉద్యోగిని జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఆమె తన ప్రియుడి బ్యాంకు అకౌంట్లో రూ.1.05 కోట్ల ప్రభుత్వ డబ్బును వేసింది. ఆమె చేస్తోన్న మోసాలు ఎట్టకేలకు బయటపడ్డాయి.
శ్రుతి నాలుగేళ్ల క్రితం టూరిజం డిపార్ట్‌మెంట్‌లో కన్సల్టెంట్‌గా చేరింది. అనంతరం ఔట్‌సోర్సింగ్ విధానంలో జూనియర్ అకౌంటెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆ శాఖ సిబ్బందికి ఆర్టీజీఎస్ ద్వారా జీతాలు పంపించే విధులను ఆమెకు అప్పజెప్పారు. ఆ డబ్బుల వివరాలను అకౌంట్స్ ఏజీఎంలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వారు సరిగ్గా పనిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు.
వారి తీరును ఆసరాగా చేసుకుని శ్రుతి మోసాలు చేయడం ప్రారంభించింది. ఎలాగో అకౌంట్స్ ఏజీఎంలు డబ్బుల చెల్లింపుల లెక్కల విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఆ డబ్బులను కొట్టేసినా అడిగే దిక్కు ఉండరని శ్రుతి భావించింది.
ప్రతి నెల జీతాల చెల్లింపుల వేళ వెండర్ పేరుతో కొంత మొత్తాన్ని అదనంగా లెక్కల్లో చూపించేది. 27 నెలల పాటు ఆమె మోసాలకు పాల్పడుతున్నప్పటికీ ఉన్నతాధికారులు గుర్తించలేదంటే వారు ఎలా విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ప్రపంచ రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. ఏ దిగ్గజ బ్యాటర్‌కూ ఇప్పటివరకు సాధ్యం కానిది..
శ్రుతి ఈ కాలంలో రూ.1.05 కోట్లను కొట్టేసింది. ఆ డబ్బులో రూ.80 లక్షలు ఓ బ్యాంకు అకౌంట్లో పడ్డాయి. ఆన్‌లైన్‌లో జీతాలు ఇచ్చేటప్పుడు ఓ ఉద్యోగి పేరును శ్రుతి అదనంగా చేర్చి, నిధులు డ్రా చేసుకుంది. శ్రుతికి నాలుగు వేర్వేరు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఇటీవల ఆ శాఖలో సరిగ్గా పనిచేసే అధికారి ఒకరు చేరారు. (Tourism department)
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆ ఎండీ లెక్కలన్నింటినీ పరిశీలించారు. దీంతో శ్రుతి చేసిన బాగోతం, ఆమె అన్ని నిధులను కొట్టేస్తున్న కనిపెట్టలేకపోయిన వారి నిర్లక్ష్యం బయటపడింది. శ్రుతి తన ప్రియుడి ఖాతాలో డబ్బును జమ చేసినట్లు నిర్ధారణ అయింది. నిర్లక్ష్యంగా పనిచేసిన అకౌంట్స్ ఏజీఎంలను కూడా సస్పెండ్ చేశారు.
శ్రుతిపై కేసు నమోదు చేయించారు అధికారులు. శ్రుతిని ఉద్యోగం నుంచి తొలగించి, విచారణ చేపట్టారు. అకౌంట్స్ ఏజీఎంల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని శ్రుతి కొట్టేసిన రూ.1.05 కోట్ల నిధులను రికవరీ చేయాలని ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశాలు జారీ చేశారు.