TGSRTC (Image Credit To Original Source)
TGSRTC: సంక్రాంతికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.
జనవరి 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండొచ్చు. దీంతో ఆయా రోజుల్లో ఉండే రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను పలు రూట్లలో నడపనున్నారు. గ్రామాలకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం జనవరి 18, 19 తేదీల్లోనూ ప్రత్యేక బస్సుల సేవలు ఉంటాయి.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్‌తో పాటు ఆరాంఘర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఉంటాయి. ప్రయాణికుల కోసం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది టీజీఎస్ఆర్టీసీ.
Also Read: Donald Trump: వెనెజువెలాకు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. ఈ సారి ఏం చేస్తారు?
పండుగల వేళ ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అలాగే ఆయా బస్సుల్లో టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును టీజీఎస్ఆర్టీసీకి ఇచ్చింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి.
మహాలక్ష్మి పథకమూ ఎప్పటిలాగే అమలు
జనవరి 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. ప్రత్యేక బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. మహిళలకు అమలుతోన్న రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో ఎటువంటి మార్పులు ఉండవు.