Donald Trump: వెనెజువెలాకు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. ఈ సారి ఏం చేస్తారు?
అమెరికా అంచనాల ప్రకారం.. చమురు అమ్మకాలు జరగకపోతే కేవలం కొన్ని వారాల్లో వెనెజువెలా ఆర్థికంగా దివాళా స్థితికి చేరవచ్చు.
Donald Trump (Image Credit To Original Source)
- చైనా, రష్యా, ఇరాన్ ఉనికి వెనెజువెలాలో ఉండొద్దన్న అమెరికా!
- చమురు ఉత్పత్తిలో పూర్తిగా అమెరికాతోనే భాగస్వామ్యం కావాల్సిందే
- అమెరికా మాటను వినకపోతే వెనెజువెలా దివాళా స్థితికి..
Donald Trump: వెనెజువెలాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డెల్సీ రోడ్రిగ్జ్ నేతృత్వంలోని వెనెజువెలా కొత్త ప్రభుత్వం చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలు తెంచుకుని, ఆయా దేశాల కంపెనీలను దేశం నుంచి బయటకు పంపాలని ట్రంప్ ప్రభుత్వం చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.
ఇలా చేస్తేనే చమురు క్షేత్రాల్లో ప్రస్తుతం తవ్వుతున్న పరిమాణం కంటే మరింత ఎక్కువగా చమురును వెలికితీయడానికి తాము ఆంక్షలు తొలగించి, వెనెజువెలాకు అనుమతి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
చమురు ఉత్పత్తిలో పూర్తిగా అమెరికాతోనే భాగస్వామ్యం కావాలని, హెవీ క్రూడ్ ఆయిల్ అమ్మకాలలో అమెరికాకు ప్రాధాన్యం ఇవ్వాలని వెనెజువెలాను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోరుతోందని ఏబీసీ న్యూస్ వర్గాలు తెలిపాయి.
వెనెజువెలాలో భారీ మార్పులు
గత వారం అమెరికా దాడుల తర్వాత వెనెజువెలాలో రాజకీయంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకుని తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. వెనెజువెలాలో పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు అమెరికానే ఆ దేశాన్ని పాలిస్తుందని ట్రంప్ ప్రకటించారు.
చైనా చాలా కాలంగా వెనెజువెలాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉంది. వెనెజువెలాపై ఒత్తిడి పెంచి తమ దారికి తెచ్చుకోవడం సాధ్యమేనని అమెరికా భావిస్తోంది.
షరతులను అంగీకరించాల్సిన పరిస్థితి
వెనెజువెలా వద్ద ఇప్పటికే ట్యాంకర్లలో చమురు నిల్వలు నిండిపోయాయి. కొత్తగా చమురును నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో, అమెరికా విధించిన ఆంక్షలకు లోబడి, షరతులను అంగీకరించాల్సిన పరిస్థితి వెనెజువెలాకు వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భావిస్తున్నారు.
బ్లూమ్‌బర్గ్ రిపోర్టు ప్రకారం.. అమెరికా దిగ్బంధనం (వాణిజ్య, రవాణా ఆంక్షలతో నియంత్రణ) వల్ల నిల్వలకు స్థలాలులేక డిసెంబర్ చివరలో వెనెజువెలా చమురు బావులను మూసివేయడాన్ని కూడా ప్రారంభించింది.
మరిన్ని చమురు బావులను మూసివేస్తే వెనెజువెలా ఆర్థిక పునరుద్ధరణ కష్టతరం అవుతుందని, దీంతో ఆ దేశంలో రోడ్రిగ్జ్ అధికారాన్ని ప్రమాదంలో పడేస్తాయని అంచనాలు ఉన్నాయి.
అమ్మకాలు జరగకపోతే కొన్ని వారాల్లోనే దివాళా
అమెరికా అంచనాల ప్రకారం.. చమురు అమ్మకాలు జరగకపోతే కేవలం కొన్ని వారాల్లో వెనెజువెలా ఆర్థికంగా దివాళా స్థితికి చేరవచ్చు. తాజాగా, సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ రోజర్ వికర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రణాళిక మొత్తం వెనెజువెలా చమురుపై నియంత్రణ సాధించడంపైనే ఆధారపడిందని అన్నారు.
అమెరికా సైనిక దళాల మోహరింపు అవసరం లేదని ఆయన చెప్పారు. చమురు ట్యాంకర్లు ఓపెన్ మార్కెట్ దిశగా కదిలే వరకు కొత్త ట్యాంకర్లను నింపే పరిస్థితి ఉండదని తెలిపారు. అన్నీ ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయని అన్నారు. ఏబీసీ న్యూస్ ప్రచురించిన కథనాన్ని వైట్ హౌస్ ఇప్పటివరకు ఖండించలేదు.
