డేటాబేస్‌ ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఏం జరిగిందో తెలుసా?

డేటాబేస్‌ ధ్వంసం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

The investigation in the database destruction case is intensifying

డేటాబేస్‌ ధ్వంసం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రతిపక్షాల ఫోన్‌ కాల్స్‌ను ట్యాప్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై ఎస్‌ఐబీ పూర్వ డీఎస్పీ ప్రణీత్‌ రావును పోలీసులు విచారిస్తున్నారు. అసలు ప్రణీత్‌రావు విపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేయాల్సి వచ్చింది.. ఎవరు చేయించారు. ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌లలో ఏముంది. ఈ అంశాలపైనే అధికారులు కూపీ లాగుతున్నారు.

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ పూర్వ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల టీమ్‌ విచారిస్తోంది. ప్రణీత్‌రావు నుంచి పోలీసులు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 లక్షల సంభాషణలకు పైగా డేటాను ప్రణీత్‌రావు తొలగించినట్లు గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్లను పోలీసులు FSLకు పంపారు. అందులో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేయనున్నారు పోలీసులు. గతంలో ప్రణీత్‌రావు వాడిన సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్‌రావ్ ఇంట్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు.

రెండు రోజుల పాటు SIBలో కీలక ఆధారాలు సేకరించాయి పోలీస్ బృందాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల బదిలీల్లో కీలకపాత్ర పోషించాడు ప్రణీత్. ఒక సామాజిక వర్గానికి చెందిన మొత్తం 30 మందితో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రణీత్. 50 మంది కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను ప్రణీత్ టాప్ చేసినట్టు తేలింది. డిసెంబర్ 4న రికార్డులను మొత్తాన్ని ప్రణీత్ తొలగించాడు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేశాడు. ప్రణీత్‌రావ్ లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు.

ప్రణీత్‌రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి ప్రణీత్‌రావు సీసీకెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్టు అధికారులు నివేదిక ఇచ్చారు. SIBలోని కీలక ఫైళ్లను ప్రణీత్‌రావు మాయం చేసినట్టు గుర్తించారు. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ ద్వారా రహస్య సమాచారం సేకరించాడు. ప్రణీత్‌రావుపై SIB అదనపు ఎస్పీ డి. రమేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదుతో ప్రణీత్‌రావుపై నాన్‌ బెయిలబుల్ కేసు నమోదయింది.

9 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కేసీఆర్.. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి

ప్రణీత్‌రావుతో పాటు అతనికి సహకరించిన అధికారులపైనా కేసు నమోదుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయ‌న్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అంతర్గత విచారణలో ఆధారాలు లభ్యం కావడంతో ఈనెల 4నే ప్రణీత్‌ రావును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ సమయంలో ఆయన సిరిసిల్ల డీసీఆర్‌బీ డీఎస్పీగా ఉన్నారు. సస్పెన్షన్‌ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంతో.. ఆయన కుటుంబంతోసహా అక్కడే ఉన్నారు.

విపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌కు ప్రణీత్‌ రావుకు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్‌ఐబీలో ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరి మెప్పు కోసం ఫోన్లను ట్యాప్‌ చేశారు? ఆ సమాచారాన్ని ఎవరికి అందజేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లలో ఏముంది? అనే కోణాల్లో ప్రణీత్‌రావును విచారిస్తున్నట్లు తెలుస్తోంది.