CM KCR On Congress
CM KCR On Congress : ధర్మపురిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఉద్యమ సమయంలో ధర్మపురికి వచ్చి గోదావరి పుష్కరాలు జరపాలని నేను డిమాండ్ చేసే దాకా ఏ నాయకునికి సోయి లేదన్నారు కేసీఆర్. గోదావరి అంటే రాజమండ్రి మాత్రమే గుర్తొచ్చేది, నా డిమాండ్ తోనే ధర్మపురిలో పుష్కరాలు జరిపారు అని ఆయన అన్నారు.
తెలంగాణ వచ్చాక గోదావరి పుష్కరాలు ధర్మపురిలో నిర్వహించుకున్నాం అని గుర్తు చేశారు కేసీఆర్. నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ కోసం, ప్రజల బాగుకోసం పుట్టిందే బీఆర్ఎస్ అని చెప్పారు. దేశానికి 75 ఏళ్ల క్రితమే స్వాతంత్ర్యం వచ్చినా ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి రాలేదన్నారు.
”ఎన్నికలు వస్తాయి పోతాయి. వ్యక్తులు ఎన్నికల్లో నిల్చొంటారు. ఒక్కరే గెలుస్తారు. గెలిచిన వ్యక్తుల ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అభ్యర్థుల వెనక ఏ పార్టీ ఉందన్నది చూడాలి. పోటీలో ఉన్న వ్యక్తి గుణగణాలతో పాటు పార్టీ చరిత్ర, నడవడిక, దృక్పథం చూడాలి. చర్చించాలి. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు. అది జరగాలంటే ప్రజలు బాగా ఆలోచించాలి. తెలంగాణ సాధించిన వ్యక్తిగా చెప్పడం నా బాధ్యత. ప్రజల దగ్గర ఉండే వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల నీ భవిష్యత్తను నిర్ణయించే అస్త్రం.
Also Read : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. 35 మందికి చోటు
13 సార్లు అధికారమిస్తే ఏం చేశారు?
50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మళ్లీ వచ్చి ఒక్క ఛాన్స్ అంటోంది. అధికారమిస్తే పంటికి అంటకుండా మింగేద్దామని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. ఇప్పటికే 12-13 సార్లు కాంగ్రెస్ కు అధికారమిస్తే ఏం చేశారు? ధర్మపురిలో లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు వచ్చేలా చేశాం. మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకున్నాం. చెక్ డ్యామ్ లు కట్టుకున్నాం. తెలంగాణ వచ్చిన రోజు ఇక్కడ చిమ్మ చీకటి. కొత్తకుండలో ఈగ సొచ్చినట్లుండేది. సాగునీరు లేక వలసల బతుకులుండేవి. మేధావులు, నిపుణులు, ఆర్థిక నిపుణల సలహాలతో పాలించుకుంటూ ఓ దరికి వచ్చాం.
ప్రధానికి ఆ పిచ్చి పట్టుకుంది..
ప్రధాని రాష్ట్రం సహా 24 గంటలు పవర్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. తెలంగాణలో తప్ప. మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంటే చచ్చినా పెట్టనని చెప్పాను. దీంతో ఏడాదికి 5 వేల కోట్ల చొప్పున 25 వేల కోట్లు మనకు రావాల్సిన మొత్తం కట్ చేశారు. కరెంట్, తాగు, సాగునీరు సమస్య తీర్చుకుని ముందుకు పోతున్నాం. అన్ని వర్గాల విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం.
రాబంధులే తప్ప రైతు బంధులు లేరు..
ఒకప్పుడు అప్పులు వసూలు చేసేందుకు రైతుల ఇళ్ల తలుపులు పీక్కుపోయేవారు. ఒకప్పుడు రాబంధులే తప్ప రైతు బంధులు లేరు. రైతు బంధుతో రైతులు కొంత తెల్లబడ్డారు. ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ధాన్యం ప్రభుత్వమే కొంటోంది. కాంగ్రెస్ నాయకులు ప్రమాదకరంగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసరం ఎరికేనా? ధరణి తీసేస్తామంటున్నారు. ఒకప్పుడు అధికారులు భూములు ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చేవారు. ధరణితో రైతుల భూములకు రక్షణ వచ్చింది. ధరణి వల్లే రైతు బంధు, రైతుబీమా సక్రమంగా అందుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కూడా ఏ దళారి ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. కాంగ్రెస్ ధరణి తీసేస్తే ఈ డబ్బులన్నీ ఎలా వస్తాయి? మళ్లీ పాత దుకాణం తెరుస్తారా?
Also Read : టీడీపీ పోటీ నుంచి ఎందుకు విరమించుకుందో చెప్పాలి.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు
పెద్ద పాము మింగుతుంది జాగ్రత్త..
ఆగమాగమైతే కైలాసంలో పెద్ద పాము మింగినట్లైతది. కాంగ్రెస్ రాజ్యమే దళారీల, పైరవీకారుల రాజ్యం. ఆ సర్టిఫికెట్, ఈ సర్టిఫికేట్ అంటూ లంచాలు గుంజుతారు. రైతు బంధు, దళితబంధుకోసం ఎవరూ దరఖాస్తు చేయకున్నా నేనే ఆ పథకాలు పెట్టాను. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే హుజురాబాద్ లాగా ధర్మపురిలోనూ ఒకే దఫాలో దళితబంధు అమలు చేస్తాం. దళిత సమాజాన్ని పైకి తేవాలని ఈ పథకం తెచ్చాం. ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి ఈ ఆలోచన చేయలేదు. అమ్మ పేరు, బొమ్మ పేరు చెప్పి ఓట్లు గుంజుకున్నరు తప్ప.. దళితుల కోసం ఆలోచించలేదు.
దేశంలో నెంబర్ 1 మనమే..
సంపద పెంచి పేదలకు పంచుతున్నాం. దేశం తలసరి ఆదాయం, రాష్ట్రం తలసరి ఆదాయాన్ని బట్టి ఆ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందిందా లేదా అని చూస్తారు. మన రాష్ట్రం తలసరి ఆదాయంలో రూ.3లక్షల 18 వేలతో దేశంలో నెంబర్ వన్ గా ఉంది. ధర్మపురి ఆలయం కోసం వంద కోట్లు మంజూరు చేసుకుని పనులు చేసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని నిధులు పెంచుకుందాం” అని కేసీఆర్ అన్నారు.