Accident : బైకులపైకి దూసుకెళ్లిన లారీ..ముగ్గురు దుర్మరణం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. బైకులను ఢీకొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Accident (2)

Three killed in road accident : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. బైకులను ఢీకొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నిన్న శుక్రవారం కావడంతో జాన్‌పాడు దర్గాకి వెళ్లిన భక్తులు మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దామరచర్ల వైపు వస్తుండగా శూన్యపహడ్‌ వెళ్లే మార్గంలో ఎదురుగా వచ్చిన లారీ అదుపుతప్పి బైకులపై దూసుకొచ్చింది.

అమాంతం రెండు బైకులను ఢీకొడుతూ పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన లారీని డ్రైవర్ కంట్రోల్ చేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

మృతుల్లో ఇద్దరు వ్యక్తులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ సమీపంలోని జంకుతండాకు చెందిన దంపతులు దనావత్‌ పున్యా, దనావత్‌ మగ్తిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.