Telangana Polls: కాంగ్రెస్ ముగ్గురు ఎంపీలు గెలిచారు, బీజేపీ ముగ్గురు ఎంపీలు ఓడారు

కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి విజయం సాధించింది. సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన కాంగ్రెస్ ఎంపీలు విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఓటమి పాలయ్యారు. ఇరు పార్టీల నుంచి తలా ముగ్గురు పోటీ చేశారు. కాగా, అటు అందరూ విజయం సాధించగా, ఇటు అందరూ ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు.

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, నల్గొండ నుంచి కమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారైంది. ఆ పార్టీ నుంచి కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంగనర్ అసెంబ్లీ నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బోధ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పోటీకి ఓటమి పాలయ్యారు. ఇరు పార్టీల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఆసక్తికర పరిణామం.

కాగా, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి విజయం సాధించింది. సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. పదేళ్లు అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఇక బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.