Tiger Tension : కొమురంభీమ్ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ పెద్ద పులి..

అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది.

Tiger Tension : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెద్ద పులి గాండ్రింపుతో వణికిపోతోంది. ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తుందో తెలియడం లేదు. రక్తం రుచి మరిగిన పులి.. సిర్పూర్ మండలం ఇటుకల పహాడ్ లో సంచరిస్తూ పశువులు కనిపించినా, మనుషులు కనిపించినా.. సైలెంట్ గా వచ్చి దాడి చేస్తోంది. దీంతో గ్రామస్తులు గడప దాటి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది.

అటవీశాఖ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. నిన్న సిర్పూర్ మండలం దుబ్బగూడలో సురేష్ అనే వ్యక్తిపై దాడి చేసిన పులి.. సమీపంలో ఉన్న మహారాష్ట్రలోకి వెళ్లిపోతుందని ఒక అంచనా వేశారు. అక్కడి నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. అయితే, పులి అటు వైపు కాకుండా ఇటుకల పహాడ్ అనే గ్రామంవైపు వెళ్లింది. దారిలో పశువులపై దాడి చేసింది. అక్కడి నుంచి నేరుగా ఇటుకలపహాడ్ లో ఉన్న అడవిలో పులి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇటుకలపహాడ్ అడవిలో రెండు పెద్ద పులులు స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఈ పులి కూడా అందులోకే ఎంటర్ అయ్యిందని తెలుస్తోంది.

పెద్ద పులి కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. డ్రోన్లతో అటవీశాఖ అధికారులు మానిటర్ చేస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్థానికులకు ఫేస్ మాస్కులను కూడా పంపిణీ చేస్తున్నారు. పెద్ద పులి భయంతో ఇటుకలపహాడ్ సమీపంలో ఉన్న గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. సురేశ్ అనే రైతుపై పులి దాడి చేయడం కలకలం రేపింది.

Also Read : బీకేర్ ఫుల్.. చుట్టంలా వస్తారు సర్వం దోచుకెళ్తారు.. పోలీసులకు చిక్కిన ఘరానా దొంగల ముఠా..