Thieves Gang : బీకేర్ ఫుల్.. చుట్టంలా వస్తారు సర్వం దోచుకెళ్తారు.. పోలీసులకు చిక్కిన ఘరానా దొంగల ముఠా..
శ్రీమంతుల ఇళ్లలో జరిగే ఖరీదైన పెళ్లిళ్లు, శుభకార్యాలకు పిల్లలను అందంగా ముస్తాబు చేసి ఈ గ్యాంగ్ పంపిస్తుంది.

Thieves Gang : తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసే దొంగలను చూసి ఉంటాం. షాపులకు కన్నం వేసే కేటుగాళ్లను చూసి ఉంటాం. ఆఖరికి గుడిలో హుండీలను మాయం చేసిన చోరులను చూసి ఉంటాం. కానీ, ఈ దొంగలు ఇవన్నీ కాదని కొత్త రూట్ ను ఎంచుకున్నారు. చుట్టంలా వస్తున్నారు.. అన్నీ చుట్టేసి చెక్కేస్తున్నారు. పైగా వీళ్లు అలాంటి ఇలాంటి దొంగలు కాదు.. దొంగల బడిలో శిక్షణ తీసుకుని చిక్కకుండా చక్కబెట్టుకోవచ్చు అనే స్కిల్ ను అలవాటు చేసుకున్నారు. అసలీ దొంగలు ఎవరు, వారి టార్గెట్ స్పెషాలిటీ ఏంటి?
ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే కొందరు తెలియని వారు కూడా వస్తారు. మహా అయితే భోజనం చేసి వెళ్లిపోతారు. కానీ, వీళ్లు అలా కాదు. ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుంటే చుట్టంలా వస్తారు. పెళ్లికి వచ్చిన బంధువులతో కలిసిపోతారు. పెళ్లి పనులను నెత్తిన వేసుకుని మరీ చేస్తారు. వీళ్లు చూసే హడావుడి చూసి పెళ్లి పనులు భలే చేస్తున్నారే అనిపిస్తుంది. పెళ్లి పనులు చేస్తూనే వచ్చిన పనిపై ఫోకస్ పెడతారు ఆ కేటుగాళ్లు. ఫంక్షన్ కు వచ్చిన బంధువులు ఎవరు బంగారాన్ని బ్యాగులో పెట్టారు, ఎవరి వద్ద గోల్డ్ ఉన్న బ్యాగ్ ఉందని పరిశీలిస్తారు. ఇక వాళ్ల పెళ్లి సందడిలో బిజీగా ఉన్నప్పుడు అదను చూసుకుని సైలెంట్ గా బ్యాగ్ తో ఉడాయిస్తారు.
గతంలో కర్నాటక, జైపూర్ లోనూ ఇదే తరహా దొంగతనాలు జరిగాయి. సరిగ్గా ఇదే స్కెచ్ తో రాచకొండ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ట్రాంక్విల్ రిసార్ట్ లో నవంబర్ 14న జరిగిన పెళ్లి వేడుకలో చోరీ జరిగింది. కొందరు వ్యక్తులు బంధువుల్లా వచ్చి బంగారంతో చెక్కేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుని చేధించి మహారాష్ట్రలో నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 38 తులాల బంగారం, 40వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో విస్తుపోయే నిజాలు బటయపడ్డాయని పోలీసులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ రాజ్ గడ్ జిల్లా గుల్ఖేడీ, హుల్ఖేడీ, ఖడియా గ్రామాల్లో కొందరు యువకులు దొంగతనాన్నే తమ వృత్తిగా మార్చుకున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు విద్యా సంస్థలు ఉన్నట్లు ఈ గ్రామాల్లో దొంగలకు శిక్షణ ఇచ్చే సెంటర్లు ఉన్నాయి. దొంగతనం, రద్దీ ప్రదేశాల్లో బ్యాగులు కొట్టేయడం, వేగంగా పరిగెత్తడం, పోలీసుల నుంచి తప్పించుకోవడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. పిల్లలకు 12, 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్వయంగా తల్లిదండ్రులే ఈ పాఠశాలలకు పంపిస్తారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారు దొంగతనాలు, దోపిడీల్లో ఆరితేరిపోతారు. శిక్షణ తీసుకునే వారిలో ఎక్కువగా మైనర్లే ఉండటం షాకింగ్ విషయం.
శ్రీమంతుల ఇళ్లలో జరిగే ఖరీదైన పెళ్లిళ్లు, శుభకార్యాలకు పిల్లలను అందంగా ముస్తాబు చేసి ఈ గ్యాంగ్ పంపిస్తుంది. బంగారం, వజ్రాల నగలు, డబ్బులు దొంగిలించేలా ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తుంది. దొంగతనం తర్వాత దోచుకున్న సొమ్ముతో నేరుగా గ్రామానికి చేరుకుంటారు. అయితే, ఈ ముఠాలను స్వగ్రామానికి చేరుకోకముందే పట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కష్టమే.
Also Read : అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి.. డబ్బులు ఇచ్చినా..