Tigers roam in joint Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు టెన్షన్ పెడుతున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు.. ఇప్పుడు గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి పశువులను పొట్టన పెట్టుకుంటుడంతో.. గిరిజన గ్రామాల ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు. కొమురంభీమ్ జిల్లాలో ఇప్పటివరకూ ఒకటే పులి దాడులకు పాల్పడుతుందని భావించినా.. ఒకటి కాదు.. రెండు పులులు గ్రామాలపై దాడులు చేస్తున్నాయనే విషయం మరింత కలవరానికి గురిచేస్తోంది.
గత కొన్ని నెలలుగా పట్టుకుందామన్నా దొరక్కుండా పులులు అటవీ సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఎన్ని కెమెరాలు, బోన్లు పెట్టినా వాటికి మాత్రం చిక్కలేదవి. అయితే వేరే ప్రాంత అడవుల్లోకి పులి వెళ్లిపోయిందని భావించినా.. ఆదిలాబాద్, మంచిర్యాల, కుముర్రంభీం జిల్లాలో మళ్లీ పులుల సంచారం పెరుగుతోంది. కుమురం భీమ్ జిల్లా బెజ్జూర్ మండలంలోని కుంటాలమానేపల్లి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి గాయపర్చింది.
అయితే అదే ప్రాంతంలో రెండు పులులను చూశామంటున్నారు స్థానికులు. పులుల సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అరణ్యంలో నుంచి ఆహారం కోసం జనావాసాల్లో.. లేకపోతే మేతకు వెళ్లిన పశువులపై పులులు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట పెద్దపులి కనిపిస్తోంది.