Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం ఇవాళ (సోమవారం) జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంతోపాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Telangana: కొత్త రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం..
మధ్యాహ్నం సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కులగణనపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, 42శాతం బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి ఇచ్చే నివేదికపై చర్చ జరగనుంది. అదేవిధంగా.. తాజా ఢిల్లీ పరిణామాలను క్యాబినెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.
గోశాలల పాలసీపై ఈ కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు.. రేషన్ కార్డులను పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలపై, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లాల వారిగా పురోగతిపై కేబినెట్‌లో చర్చించనున్నారు. యూరియా లభ్యత, డిమాండ్ తదితర అంశాలపై మంత్రివర్గం తీర్మానం చేయనుంది.
జిల్లాలో మంత్రుల పర్యటనల్లో పరిశీలించిన అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్య సహకార సంఘాల పర్సన్ ఇంఛార్జ్‌ల నియామకంతోపాటు కాళేశ్వరంపై నివేదిక ఇవ్వనున్న పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పైకూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.