TPCC Chief Revanth Reddy : హుజూరాబాద్ అపజయం పూర్తి బాధ్యత నాదే-రేవంత్ రెడ్డి

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

TPCC Chief Revanth Reddy :  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన బల్మూరి వెంకట్ కు 2,903 ఓట్లు లభించాయి. మొత్తం పోలైన ఓట్లు 2,05,236కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ కి 78,997, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 1,01,732 ఓట్లు లభించాయి. 2018 ఎన్నికల్లో హజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 60 వేల ఓట్లను సాధించింది. రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు మారతాయని చాలామంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భావించారు. కాని రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలపై దృష్టి సారించలేదు.

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఆ పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించినా…. ఎన్నికలకు కేవలం పదిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. దీంతో పూర్తిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలను పట్టించుకోని విధంగానే రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఓ వైపు ఉప ఎన్నికల ప్రచారం జరుగుతున్నా…..మరోవైపు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పలు సభలు సమావేశాలు నిర్వహించారు, కాని హుజూరాబాద్ వైపు చూడలేదు.. ఇదే అదనుగా పార్టీలోని రేవంత్ వ్యతిరేక వర్గీయులు పలువురు సీనియర్లు రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
Also Read : Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిశాయి.. ఓటమితో కుంగిపోము -హరీష్ రావు

కానీ ఎన్నికల ఫలితాల్లో పూర్తి భాద్యత తనదే అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటీ నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు. తనకు ఇంకా వయస్సు ఉందని పార్టీని 20 సంవత్సరాల పాటు పార్టీని ముందుకు తీసుకుని పోయి అధికారంలోకి తీసుకుపోతానని చెప్పారు. ఒక ఓటమిపై పార్టీలో సమీక్ష చేసుకుంటామని .. మరో రెండు రోజుల తర్వాత పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్‌కు పార్టీలో భవిష్యత్ ఉంటుందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు